ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల భద్రతకు ముప్పుతెచ్చేలా పోలీస్ బాస్ చర్యలు
బౌన్సర్లు, ప్రైవేట్ గన్‌మెన్లు, సెక్యూరిటీ సిబ్బందిపై ఆరా
వీరిని నియమించుకుంటున్న వారి వివరాలపై దృష్టి
నిరంతర నివేదికలు సమర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు
ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల భద్రతను గాలికి వదిలేసిన ప్రభుత్వం
డీజీపీ తాజా ఆదేశాలతో ప్రశ్నార్థకంగా మారిన ప్రతిపక్ష నేతల భద్రత
భద్రత కల్పించక.. ఉన్న భద్రతనూ దూరం చేయడానికి చేస్తున్న కుట్రగా విమర్శలు
ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల కదలికలను నియంత్రించడమే ప్రధాన లక్ష్యమని విశ్లేషణలు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతల భద్రతను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు బౌన్సర్లు, ప్రైవేట్ గన్‌మెన్లు, సెక్యూరిటీ సిబ్బందిపై నిఘా పెట్టాలంటూ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. వీరిని నియమించుకుంటున్న వారి వివరాలపై ఆరా తీస్తూ, నిరంతర నివేదికలు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులను డీజీపీ తాజాగా ఆదేశించారు. ఈ ఆదేశాలు ప్రతిపక్ష నేతల భద్రతను మరింత ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ప్రైవేటు ఆయుధధారుల కదలికలు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు ఆస్కారం లేకుండా ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నప్పటికీ.. పోలీస్ బాస్ అసలు ఉద్దేశం ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల కదలికలను నియంత్రించడంతోపాటు, వారికి అందుతున్న రక్షణను సైతం దూరం చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి మూడు రోజులపాటు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో శాంతి భద్రతలను కాపాడటంలో, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన నేపథ్యంలోనే డీజీపీ జారీ చేసిన ఆదేశాలు సర్వత్రా చర్చకు దారితీస్తున్నాయి. ఇవన్నీ చినబాబు విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో భాగమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి.
డీజీపీ ఆదేశాలు క్లుప్తంగా
⇒ స్థానిక సంస్థల ఎన్నికల వేళ బౌన్సర్లు, ప్రైవేట్ గన్‌మెన్లు, సెక్యూరిటీ సిబ్బందిపై నిఘా ఉంచాలి.
⇒ రాష్ట్రవ్యాప్తంగా బౌన్సర్లు, ప్రైవేట్ గన్‌మెన్ల కదలికలపై ఆరా తీయాలి.
⇒ ప్రైవేటు ఆయుధధారుల కదలికలు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి.
⇒ అక్రమ ఆయుధాల సమీకరణ, బెదిరింపులు, హింసకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు ఉండాలి.
⇒ ఉన్నతాధికారులు తక్షణం స్వయంగా రంగంలోకి దిగి నిరంతరం తనిఖీలు నిర్వహించాలి.
⇒ బౌన్సర్లు, గన్‌మెన్లను నియమించుకుంటున్న వారి వివరాలు సమగ్రంగా సేకరించాలి.
⇒ వారికి ఆర్థిక సాయం చేస్తున్నవారు, వాహనాలు సమకూరుస్తున్నవారు, వసతి కల్పిస్తున్నవారిని గుర్తించాలి.
⇒ జిమ్‌లు, బాడీబిల్డింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా వ్యక్తుల సమీకరణపై వచ్చిన సమాచారాన్ని ధ్రువీకరించాలి.
⇒ తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు.
⇒ డీఎస్పీ స్థాయి సబ్ డివిజనల్ పోలీసు అధికారులు (ఎస్‌డీపీఓలు), స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓలు) వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి
⇒ తనిఖీలు, గుర్తించిన ఉల్లంఘనలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నమోదైన కేసులపై రోజువారీ నివేదికలు సమర్పించాలి.
⇒ తనిఖీలు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం.
సెక్యూరిటీ సిబ్బందిపై అక్రమ కేసులకు రంగం సిద్ధం
రాష్ట్రంలో అధికారపక్షానికి జీ హుజూర్ అంటున్న పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కీలక నేతలు, వీఐపీల భద్రతను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది నాయకులు బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఇప్పుడు పోలీస్ బాస్ చేపట్టిన చర్యల వెనుక.. ‘ప్రైవేట్ బౌన్సర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది (పీఎస్‌ఓలు), ప్రైవేట్ గన్‌మెన్లపై కేసులు నమోదు చేయడం, వారి సేవలు పొందుతున్న నేతలనూ అక్రమ కేసుల్లో ఇరికించడం’ ప్రధాన ఉద్దేశమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలకు కచ్చితంగా లైసెన్స్ ఉంటుంది. ప్రైవేటు గన్‌మెన్ల ఆయుధాలు, వాటి వినియోగం, సంబంధిత సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఎప్పుడూ ఉంటాయి. చట్టానికి లోబడే ఈ వ్యవస్థ అంతా పనిచేస్తుంది. అటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా ‘ప్రైవేట్ సెక్యూరిటీపై పోలీసులు ఆరా’ అంటే దీని వెనుక ప్రభుత్వ తప్పుడు ఉద్దేశాలు ఏమిటన్నది అందరికీ అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని కేసుల పేరుతో తీవ్ర ఇబ్బందుల్లోకి నెడితే, వారు ప్రతిపక్ష నేతల భద్రత బాధ్యతల నుంచి తప్పుకొంటారు. అదే జరిగితే రాష్ట్రంలో ప్రతిపక్షంలోని వీఐపీల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. వారి కదలికలపైనే నియంత్రణలు ఏర్పడతాయి. స్థానిక ఎన్నికల్లో ఇక అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలకు తెగబడవచ్చు’ అన్నది చంద్రబాబు ప్రభుత్వ కుట్రగా కనబడుతోందని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.


