కొత్తకొత్తగా.. రంజాన్‌ కానుకగా.. 

Bara Shaheed Dargah Idgah Development Work Completed In Nellore - Sakshi

 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1.03 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మాణం

రొట్టెల పండగకు వేదికగా నిలిచే బారాషహీద్‌ దర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి ఆవరణలో ఉన్న ఈద్గా భవనం ముస్లింలకు ఎంతో ప్రీతికరం. అయితే టీడీపీ హయాంలో ఈద్గా నిర్మాణాన్ని అర్థాంతరంగా కూల్చేశారు. కొత్త నిర్మాణం చేపడుతామని మిన్నకుండి పోయారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. రంజాన్‌ కానుకగా ముస్లింలకు అంకితం చేయనున్నారు. 

సాక్షి, నెల్లూరు : నెల్లూరులో చారిత్రాత్మకమైన ప్రదేశంగా విరాజిల్లుతున్న బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో ప్రత్యేకతలతో కూడిన ఈద్గా నిర్మాణం పూర్తయింది. రంజాన్‌ మాసం కానుకగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈనెల 29న ముస్లింలకు అంకితం చేయనున్నారు. గత టీడీపీ హయాంలో ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఈద్గాను కూల్చివేసి నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి చొరవతో పూర్తి హంగులతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు.

అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం   
బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం చేపట్టడం ఆనందదాయకం. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేయించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనివిధంగా నిర్మాణం చేయించారు. ముస్లింల పట్ల ఎమ్మెల్యేకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు మేమంతా కృతజ్ఞతులై ఉంటాం. – అబూబకర్, మాజీ చైర్మన్, బారాషహీద్‌ రొట్టెల పండగ కమిటీ

ఎంతో సంతోషంగా ఉంది   
ప్రత్యేక హంగులతో నిర్మించిన ఈద్గాను రంజాన్‌ కానుకగా మాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా ఈద్గా లేక ప్రార్థనల కోసం ఇబ్బందిపడేవారం. స్థానిక ఎమ్మెల్యే మా మనోభావాలను గౌరవిస్తూ ఈద్గా నిర్మాణంపై దృష్టిపెట్టి మాకు రంజాన్‌ కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది. పండగ రోజు అందరం కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటాం.  – ఎస్డీ ఇలియాజ్‌ స్థానికుడు, నెల్లూరు  

వైఎస్సార్‌సీపీ హయాంలో.. 
రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అదే విధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. తాజాగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో రూ.1.03 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు.  

గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కానీ ఈ ఏడాది రంజాన్‌ పండగ కానుకగా ఈద్గాను వారికి అంకితం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపారు. రంజాన్‌ మాసం చివరి శుక్రవారం ఈనెల 29న వారికి అంకితం చేసేందుకు కృషి చేస్తున్నారు.  

 100 అడుగుల వెడల్పు, సుమారు 70 అడుగుల ఎత్తులో మినార్ల నిర్మాణం చేపట్టారు.  

వచ్చే శుక్రవారం అంకితం..
రంజాన్‌ మాసం చివరి శుక్రవారం ఈద్గాను స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముస్లింలకు అంకితం చేయనున్నారు. దాదాపు రెండు వేల మందికి పైగా ముస్లింలు హాజరుకానున్న సభలో ఇఫ్తార్‌ విందు కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో పూర్తి హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈద్గా నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదని ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో.. 
బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఈద్గాలో నగరంలో ఉన్న ముస్లింలు బక్రీద్, రంజాన్‌ పండగలకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేవారు. ప్రతి ఏటా రెండు పండగలకు ఈద్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యక ప్రార్థనలు  చేసుకునేవారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈద్గాను కూల్చివేశారు. ఆ ప్రదేశంలో నూతన ఈద్గా నిర్మిస్తామని చెప్పి పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా ఈద్గా లేక ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top