
‘రొట్టెపై కవిత గట్టేంత సాహసం చేయలేను. కాని మిమ్మల్ని ఆ నిప్పుల పొయ్యి వరకూ రమ్మని ఆహ్వానిస్తాను. అక్కడ తినడానికి సిద్ధమవుతున్న రొట్టెను దర్శించమని, ఆ అద్భుతాన్ని తిలకించమని వేడుకుంటాను’ అంటాడొక హిందీ కవి.
సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, ఆకాశహార్మ్యాలు, విమానం టికెట్టులు, లాకర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, మురుగు పొంగితే ఇష్టరీతిన చుట్టుముట్టినట్టు చేరే అసమంజస ధనం... ఇవి కొందరికి అద్భుతంగా తోచవచ్చు. కాని ఆకలిగొన్నవాడికి పొయ్యి మీద కాలుతున్న రొట్టె కంటే అద్భుతమైనది మరొకటి ఉండదు.
ప్రతి పూటా అది అపురూపమే. అందుకే కవి అంటాడు– ‘ప్రతిసారీ ఇంతకు ముందు కంటే మరింత రుచిగా ఉంటుంది. ప్రతిసారీ ఇంతకు ముందు కంటే ఎంతో గుండ్రంగా అగుపిస్తుంది. ఆకలి గురించి అగ్ని పలికే గొప్ప వాంగ్మూలం కదా రొట్టె’....బైబిల్‌లో రొట్టె కేవలం రొట్టె కాదు. జీవితానికి సంకేతం. జీవితానికి ఏమి కావాలి?
పంచడం... పంచుకు తినడం తప్ప. ‘ప్రభూ... వారిని ఇంటికి వెళ్లమని చెప్పు. వాళ్లు వెళితే వారి వారి రొట్టెలు సంపాదించుకు తినగలరు’ అని శిష్యులు ఏసు ప్రభువుకు చెబుతారు. అప్పటికే వారంతా ఎడారి వంటి ప్రాంతంలో ఉన్నారు. ఏసు వెంట ఐదు వేల మంది ఉన్నారు ఆయన ఆరాధనలో.
వారంతా ఇళ్లకు వెళ్లి రొట్టెలు ఎప్పటికి తినాలి? ‘మన వద్ద ఏం ఉన్నాయి?’... ‘ఒక బాలుడి బుట్టలో ఐదు రొట్టెలు, రెండు చేపలు’.... కరుణామయుడి హృదిలో సాటి మనిషి ఆకలి పట్ల ఎంతటి కరుణ ఉంటుందంటే ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలే ఐదువేల మందికి సరిపోతాయి.
పరిమళా సోమేశ్వర్ రాసిన ‘రొట్టె కోసం’ అనే కథలో ఆకలిగొన్న పేదబాలుడు ఇంటింటికీ తిరుగుతూ రొట్టె కోసం అంగలారుస్తాడు. ఒక డబ్బున్న మహిళ రోజూ రొట్టెలు చేసి కాకులకు వేయడం వాడికి తెలుసు. ఆ రోజున కాకులకు బదులుగా తను దక్కించుకోవాలని ప్రయత్నిస్తే ఆ మహిళకు ఎంత కోపం వస్తుందో.
‘ఫో... వెధవా’ అని తరిమి కొడుతుంది. కాకులకు వేస్తే పుణ్యంగాని ఇలాంటి వెధవలకు వేస్తే ఏం పుణ్యం? వివిన మూర్తి రాసిన ‘రొట్టె ముక్క’ అనే కథలో కడుపుతో ఉన్న దళితురాలికి రొట్టె ముక్క తినాలని మనసులో పడుతుంది. మినపరొట్టె. ఆ చిన్న కోరిక తీరడం, తీరకపోవడం వెనుక జాతుల దోపిడి అంతా ఉంది.
మనుషుల్ని దొంగలుగా మార్చడం రొట్టె ప్రధానంగా చేసే పని. విక్టర్ హ్యూగో ప్రఖ్యాత నవల ‘లే మిజరబుల్స్’లో ప్రధాన పాత్ర జీన్ వాల్‌జీన్ రొట్టెను దొంగిలించడంతో ఆ నవల తర్వాతి ఘటనలన్నీ రూపు కడతాయి. జీన్ వాల్‌జీన్ రొట్టెను దొంగిలించింది కుటుంబం ఆకలి తీర్చడం కోసం.
గమ్మత్తు ఏమిటంటే ఈ నాగరిక ప్రపంచపు నిర్మాణమంతా రొట్టెను న్యాయంగా దక్కనీకపోవడంపై ఆధారపడి ఉంది. ఇచ్చే చేయి ఒకరిదిగా పుచ్చుకునే చేయి మరొకరిదిగా ఉంచడం వల్ల ప్రపంచంలోని కొద్దిపాటి కుబేర సంతతి బతుకు ఈడ్చగలుగుతుంది.
ఈ కుబేరులు కుబేరుల్లా ఉండటానికి మొదట జనానికి రొట్టె లేకుండా చేస్తారు. జనం రొట్టె తినే పరిస్థితిలో ఉంటే గనక యుద్ధాలు తెచ్చి ఇళ్లనూ, వంటగృహాలను ధ్వంసం చేస్తారు. రొట్టెకై అలమటించి జనం చస్తున్న సమయాల్లో కుబేరుల ఇళ్లలోని చలినెగళ్లు మరింత ఎర్రగా నాల్కలు సాచి వెచ్చదనం ఇస్తాయని వారూ వీరూ చెప్పడమే!
‘తిండి లేని పిల్లలున్న దేశంలో పాలు నల్లగా ఉంటాయి. పిల్లలకు తిండి లేని దేశాల్లో రొట్టెలు రాళ్లలా ఉంటాయి’ అని రాస్తాడు వాడ్రేవు చినవీరభద్రుడు. నక్సలైటు పేరుతో అమాయకుణ్ణి తెచ్చి, ఇంటరాగేషన్ పేరుతో నాలుగు రోజులుగా ఆకలికి మాడుస్తుంటే తన వద్ద ఉన్న రొట్టెలను అతడికి రహస్యంగా పెట్టడం గురించి కన్నీళ్లతో రాస్తారు సత్యమూర్తి అలియాస్ శివసాగర్.
‘రొట్టె చేసేందుకు రైతు శ్రమిస్తున్నాడు. రొట్టెతో ఆకలి తీర్చుకునే సామాన్యుడు శ్రమిస్తున్నాడు. కాని రొట్టెతో ఆడుకునే పెద్దమనుషులు పెద్దలసభలో కూచుని ఉన్నారే’ అని సుధామా పాండే ధూమల్ రాసిన ప్రఖ్యాత కవిత ‘రోటీ ఔర్ సన్సద్’ ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటుంది.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా 80 కోట్ల మందికి రొట్టెగ్రాసం ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఈ దేశంలో ఆ స్థితిని యథాతథంగా ఉంచడానికి కారణం తగిన సాహిత్యం పుట్టడానికే కాబోలు. లేకుంటే మనకేం తక్కువ.
జూలై 6 నుంచి నెల్లూరులో రొట్టెల పండగ మొదలయ్యింది. అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పాల్గొని అక్కడి ‘బారా షహీద్ దర్గా’ వద్ద వున్న చెరువులో మోకాటి లోతున దిగి ఒకరి నుంచి మరొకరు రొట్టెలు మార్చుకుంటారు. ఏం రొట్టెలు అవి? ‘సంతానం రొట్టె’, ‘సౌభాగ్యం రొట్టె’, ‘ఆరోగ్యం రొట్టె’, ‘ఉద్యోగం రొట్టె’, ‘సొంతింటి రొట్టె’, ‘పెళ్లి రొట్టె’, ‘చదువు రొట్టె’.... అందరివీ చిన్న చిన్న కోరికలు... చిన్న చిన్న ఆశలు... చిన్న చిన్న ఆకాంక్షలు.... ప్రపంచంలోగాని, ఈ దేశంలోగాని, ఏ నైసర్గికతలోగాని కోటాను కోట్ల సామాన్యులకు ఇంతకు మించిన కోరికలు ఉండవు. వారంతా ‘దో వక్త్‌కీ రోటీ’ దొరికి జీవితం చీకూ చింతా లేకుండా గడిచిపోతే చాలనే కోరుకుంటారు.
ఈ మందభాగ్యులను పాలించడానికి కర్కశత్వం అవసరమా? కరుణ సరిపోదా?