అఖిలమ్మా... అప్పు కట్టమ్మా! మాజీ మంత్రి ఇంటి ముందు బ్యాంకు సిబ్బంది నిరసన

Bank staff protest in front of Akhila priya at Allagadda - Sakshi

ఆళ్లగడ్డ: అప్పు చెల్లించాలని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు బ్యాంకు అధికారులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దివంగత భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జగత్‌ డెయిరీ కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు.

ఆయన మృతి చెందినప్పటి నుంచి వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారసులకు పలు దఫాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో యూనియన్‌ బ్యాంకు (ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్‌ విలీనమైంది) లోన్‌ రికవరీ అధికారులు ఆళ్లగడ్డ చేరుకుని అఖిలప్రియ ఇంటి ముందు అప్పు చెల్లించాలని ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిసింది.

అనంతరం ఈ అప్పునకు ష్యూరిటీ పెట్టిన ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోట్‌ల్‌ ముందు కూడా ‘బ్యాంక్‌ మనీ పబ్లిక్‌ మనీ, మా బకాయిలు చెల్లించండి–సగర్వంగా జీవించండి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంపై అఖిలప్రియ ఫోన్‌లో బ్యాంకు అధికారులతో మాట్లాడి కొంత గడువు ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top