
సాక్షి,నంద్యాల జిల్లా: తల్లిదండ్రులారా.. తస్మాత్ జాగ్రత్త! మీ పిల్లల భద్రత మీ చేతుల్లోనే ఉంది. బస్సులో స్కూల్‌కు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో ప్రతి క్షణం అప్రమత్తత అవసరం. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్న నిండు ప్రాణాల్ని కోల్పోవాల్సి వస్తుంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన తొలిరోజే చిన్నారిని స్కూల్ బస్సు ప్రాణం తీసింది. పోలీసుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డలో ఎంవీ నగర్‌కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ(5). ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఈక్రమంలో ఇవాళే తొలి రోజు స్కూల్‌కు వెళ్లింది. అనంతరం స్కూల్ బస్సులో ఇంటికి వచ్చింది.
అయితే చిన్నారి బస్సు దిగి ముందు నుంచి ఇంటి వైపుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పుడే ఘోరం జరిగింది. బస్సు ముందు నుంచి హరిప్రియ ఇంటికి వెళుతున్న విషయాన్ని పట్టించుకోలేదు. ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలిక బస్సు చకక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక ప్రాణాలు కోల్పోవడంతో ఎంవీ నగర్‌లో విషాదం నెలకొంది. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.