బంగ్లాదేశ్ నౌక ‘ఎంవీ-మా’ ఆపరేషన్‌

Bangladesh MV MAA Ship Runs Aground In Vizag Beach - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అలల ఉధృతికి పోర్టు నుంచి తెన్నేటి పార్కు ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కి చెందిన ‘ఎంవీ–మా’ జనరల్‌ కార్గో నౌకను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది  ప్రస్తుతం నౌక ఉన్న స్థితిగతులను బుధవారం పరిశీలించారు. నౌక ఎంత మేరకు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కింద భాగంలో రాళ్లు ఏ మేర ఉన్నాయి.. నౌకను సముద్రంలోకి పంపించే సమయంలో నౌకలోని భాగాలు దెబ్బతినే అవకాశం ఉందా వంటి అంశాల్ని పరిశీలించారు. ఎంవీ మా కార్గో షిప్‌ యాజమాన్యంతో పాటు షిప్‌ స్థానిక ఏజెంట్, హల్‌ అండ్‌ మెషినరీ క్లబ్, విశాఖపోర్టు ట్రస్టు, డీజీ షిప్పింగ్, ఇండియన్‌ కోస్ట్‌గార్డు, జిల్లా కలెక్టరేట్, స్థానిక, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ విభాగాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వాములవుతున్నాయి.

అంతర్జాతీయ నిబంధనల మేరకు నౌకను సముద్రంలోకి పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు హల్‌ అండ్‌ మెషినరీ విభాగం సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఒడ్డు నుంచి తీస్తున్న సమయంలో నౌక నుంచి చమురు సముద్రంపై పడి తెట్టులా కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు  ఈ సమయంలో వినియోగించే పరికరాలు, ఇతర సామాగ్రితో ఆ ప్రాంతమంతా వ్యర్థాలతో నిండిపోతుంది. కోస్ట్‌గార్డు భాగస్వామ్యంతో వీటన్నింటిని తొలిగించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అంగీకారం తెలిపింది. గురువారం లేదా శుక్రవారం   ఆపరేషన్‌ ఎంవీ–మా కు ఉపక్రమించే అవకాశం ఉందని పోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కార్గోను చూసేందుకు క్యూ
ఆరిలోవ(విశాఖ తూర్పు): తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన కార్గో నౌకను తిలకించడానికి నగర ప్రజలు తరలివస్తున్నారు. బుధవారం నౌక వద్దకు ఎవ్వరినీ పోలీసులు వెళ్లనీయకపోవడంతో.. దూరం నుంచి చూస్తూ సంతోషించారు. దీంతో జోడుగుళ్లపాలెం బీచ్‌ నుంచి తెన్నేటి పార్కు వరకు సందడి నెలకొంది. కరోనా కారణంగా బోసిపోయిన ఇక్కడ బీచ్‌ నౌక వల్ల మళ్లీ నిండుదనం సంతరించుకుంది. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. సందర్శకులు ఎక్కువ సేపు గుమిగూడకుండా నియంత్రించారు. ఇదిలా ఉండగా ఉదయం నుంచి పలుమార్లు నేవీ అధికారులు ఇక్కడకు వచ్చి నౌక లోపల ఆయిల్‌ బయటకు తీసే మార్గం, సామగ్రిని ఏ విధంగా తీసుకురావాలనే అంశాలను పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top