ధర లేకపోవడంతో అనంతపురం జిల్లా రాయలచెరువులో మేకలు, గొర్రెలకు అరటి గెలలను మేతగా వేసిన దృశ్యం
వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో అన్నదాత కుదేలు
పంటను తొలగించి పశువులకు మేతగా వాడుతున్న వైనం
ఈ రెండు జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో అరటి సాగు
ధరలు పతనం కావడంతో కోలుకోలేని విధంగా దెబ్బ
నెల రోజులుగా టన్ను రూ.2 వేలు కూడా పలకని పరిస్థితి
దళారీల పాలవుతున్న రైతు కష్టం.. చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
పెట్టుబడి కూడా దక్కక అన్నదాత గగ్గోలు.. కనీస మద్దతు ధర ప్రకటించని సర్కారు
అనంతపురం అగ్రికల్చర్, కడప అగ్రికల్చర్/లింగాల: నాణ్యమైన అరటి పంటకు పేరుగాంచి, గల్ఫ్ దేశాలకు సైతం ఎగుమతులు చేసిన అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల రైతులు నేడు దీనావస్థ ఎదుర్కొంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. అయితే, పెట్టుబడులు కూడా దక్కని కనిష్ఠ స్థాయికి మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి. గెలలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు. కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీదే వదిలేశారు. మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. రూ.లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. రూ.కోట్లలో నష్టపోతున్నా... చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. కరోనా లాంటి తీవ్ర విపత్తు తర్వాత తొలిసారి ధరలు పతనం అయ్యాయని పేర్కొంటున్నారు.
కనీస మద్దతు ధర ప్రకటించని చంద్రబాబు సర్కారు
వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల అరటి రైతుల కష్టాలు, కడగండ్లు పట్టించుకునే స్థితిలో చంద్రబాబు సర్కారు లేదు. కనీసం మద్దతు ధర కూడా ప్రకటించలేదు. అనంతపురం జిల్లాలో 40వేల ఎకరాల్లో అరటిసాగు అవుతుంది. లక్షన్నర టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ–క్రాప్ ప్రకారమే 32 మండలాల్లోని 13 వేల మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాల్లో వేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 700 ఎకరాల్లో అరటి సాగైంది. ఎకరాకు 22–25 టన్నుల దిగుబడి వచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది 8 లక్షల టన్నులపైగా అరటి పంట వస్తుందని అంచనా.
⇒ వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతు కుదేలయ్యాడు. జిల్లా వ్యాప్తంగా 20,231 ఎకరాల్లో అరటి సాగైంది. లింగాల, పులివెందుల, కాశినాయన, వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అత్యధికంగా పంటను డోజర్‌లతో తీసేస్తున్నారు. లింగాల మండలంలో మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురు గాలులతో అరటి రైతులకు అపార నష్టం సంభవించింది. మార్చిలో తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, పార్నపల్లె, పెద్దకుడాల గ్రామాల్లో 567 హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోయింది. ఏప్రిల్‌లో లింగాల, చిన్నకుడాల, రామనూతనపల్లె, గుణకణపల్లె, మురారిచింతల తదితర గ్రామాల్లో 488 హెక్టార్లలో తోటలు కూలిపోయాయి. 9 నెలలైనా ఇంతవరకు ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ అందలేదని రైతులు వాపోతున్నారు.
ధరలు నెలలోనే రూ.వెయ్యికి పతనం
అరటిలో రెండేళ్లలో మూడు పంటలు తీస్తారు. మొక్క నాటిన తర్వాత ఏడు నెలలకు మొదటి గెల వస్తుంది. మొత్తంగా 10 నెలల కాలంలో మొదటి పంట పూర్తవుతుంది. తర్వాత 8 నెలలకు రెండో పంట పండిస్తారు. ఈ రెండు విడతలు కచి్చతం. కొందరు మూడో విడత కూడా సాగు చేస్తారు. ప్రస్తుతం రెండో మూడో విడత కోతలు జరగుతున్నాయి. నెల కిందట టన్ను రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముడవగా పెట్టుబడులు దక్కాయి. క్రమంగా టన్ను రూ.వెయ్యి, రూ.2 వేలకు పతనమైంది. దీంతో రైతులు తోటలు వదిలేస్తున్నారు. కాయలు మాగిపోతున్నా అడిగేవారు లేనందున ట్రాక్టర్లతో పారబోస్తున్నారు. టన్ను కనీసం రూ.12 వేలైనా పలికితే కాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. డిసెంబర్ నుంచి మొదటి పంట కోతలు మొదలవుతాయని, ఇవే ధరలుంటే తమ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తుతున్నారు. అయినా చంద్ర బాబు సర్కారు చోద్యం చూస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టుకు వెళ్లే యోచనలో అరటి రైతులు
మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన వైఎస్సార్ కడప జిల్లా అరటి రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో పరిహారం ఇప్పించాలని కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
దెబ్బతిన్న రైతులకు ఆర్థిక సాయం
మార్చి 23న పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో అరటి తోటలు కూలిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ మరుసటి రోజే తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి పర్యటించారు. కూలిన తోటలను చూసి చలించిపోయారు. రైతులకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెలలోపే నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు చెక్కులను అందజేశారు.
ప్రభుత్వానిదంతా హడావుడే.. పైసా సాయం లేదు
వైఎస్ జగన్ లింగాల మండలంలో పర్యటిస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అదే రోజు పార్నపల్లె, కోమన్నూతల గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వం నుంచి అరటి రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి కూడా రైతులను ఆదుకుంటామని చెప్పారు. హెక్టార్‌కు రూ.30 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని గొప్పలు పోయారు. ఇంతవరకు చిల్లిగవ్వ అందలేదని అరటి రైతులు వాపోతున్నారు.
పైసా రాలేదు..
మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా 4 ఎకరాల్లోని అరటి పంట పూర్తిగా కూలిపోయింది. ఆదుకుంటామని అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పైసా సాయం చేయలేదు. అరటి సాగుకు సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాను. నష్టాల ఊబిలో కూరుకుపోయా. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. –వందలపల్లె కేశవ, అరటి రైతు, తాతిరెడ్డిపల్లె, వైఎస్సార్ కడప జిల్లా
ఎదురుచూపులే మిగిలాయి...
చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు మాటలు చెప్పి వెళ్లిపోయారు. ఇంతవరకు నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వైఎస్ జగన్ వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందించారు. ఈ ప్రభుత్వంలో ఎదురుచూపులు తప్ప ఎలాంటి ఫలితం లేదు.
– పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, వైఎస్సార్ కడప జిల్లా
పెట్టుబడి కూడా కష్టమే..
మూడు ఎకరాల్లో అరటి సాగుకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశాను. పంట కోతకు వచి్చనా అడిగేవారు లేరు. కొట్టేవారు కనిపించడం లేదు. కాయలు మాగిపోతున్నాయి. ధర రూ.వెయ్యి అంటున్నా దానికీ ముందుకురావడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. మొక్కలు, నాటడం, వేసవిలో కాపాడుకోవడం, కూలీలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చు అన్నీ లెక్కేస్తే భయమేస్తోంది.
– బండి శివనారాయణ, ముచ్చుకోట, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా
టన్ను రూ.400 చొప్పున ఇచ్చేశా
15 ఎకరాల్లో అరటి సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చుపెట్టా. తెలంగాణ నుంచి లారీ కోడి పెంట రూ.60 వేలకు కొన్నాను. పంట చేతికొచ్చినా ధరల్లేక నష్టాలు భరిస్తున్నా. 5 ఎకరాల పంట మూడో విడత కోతకు సిద్ధంగా ఉంది. ధర కోసం 15 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేదు. టన్ను రూ.400 ప్రకారం 10 టన్నులు ఇచ్చేసి దున్నేస్తున్నా. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. – బానా నాగేశ్వరరెడ్డి, కడవకల్లు, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా


