
సాక్షి, అమరావతి: దేవాంగ కులాన్ని హేళన చేసి, కించపరిచేలా మాట్లాడటం సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తగదని ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ..దేవబ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారికి నాయకుడు రావణాసురుడని చరిత్ర వక్రీకరించి మాట్లాడారని పేర్కొన్నారు. దేవాంగ కులాన్ని ఉద్దేశించి హేళనగా లకలకలకలక అని వికటాట్టహాసంతో నవ్వి సన్నివేశాన్ని వివరించడం దారుణమన్నారు. బాలకృష్ణ అసందర్భ ప్రేలాపనలతో దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
దేవాంగుల కుల గురువు దేవళ మహర్షని, కులదైవం చౌడేశ్వరి మాతని, దేవాంగుల చరిత్ర బ్రహ్మాండ పురాణంలో రాయబడిందని, మనుచరిత్ర, ఇతిహాసాలతో ముడిపడిన దేవాంగుల జాతి ఖ్యాతి గురించి తెలియకుండా హేళన చేయడం బాలకృష్ణకు తగదని హితవు పలికారు. తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకొని దేవాంగ సమాజానికి క్షమాపణ చెప్పాలని బాలకృష్ణను డిమాండ్ చేశారు.