‘చందాలు దండుకునేందుకే  అమరావతి పేరుతో యాత్రలు’

Bahujan Pariraksan Samithi Leaders Criticized Amaravati Yatras - Sakshi

తాడికొండ: అమరావతి పేరుతో చందాలు దండుకునేందుకు కులవాదులు యాత్రలు చేయడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు 
ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 689వ రోజు రిలే నిరాహార దీక్షలకు బుధవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అవినీతిని కప్పిపెట్టి, ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని ఓ సామాజికవర్గం ఈ పాదయాత్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు రాష్ట్రమంతా తిరిగి చందాలు వసూలు చేసుకుంటూ ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో ఉంటూ వీరు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

పేదల సమస్యలను పక్కన పెట్టిన రాజకీయ పార్టీలు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతూ చంద్రబాబు అవినీతిని కాపాడేందుకు పాట్లు పడుతుండటాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఎల్లో మీడియాలో తమ ఉద్యమాన్ని చూపనప్పటికీ.. బహుజన హక్కుల కోసం పోరాడుతున్న తమకు, మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శ్యామ్యూల్, ఇంటూరి రాజు పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అమరావతిపై ‘డబ్బుల్‌’ గేమ్‌!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top