వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి | Babu Jagjivan Ram Death Anniversary At YSRCP Central Office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి

Jul 6 2025 12:13 PM | Updated on Jul 6 2025 1:55 PM

Babu Jagjivan Ram Death Anniversary At YSRCP Central Office

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్ర‌ధాని డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజ‌కీయ నాయ‌కుడిగా దేశానికి ఆయన అందించిన సేవ‌లను శ్లాఘించారు.

కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రను వేశారని కొనియాడారు. ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగజ్జీవన్‌ రామ్ చేసిన కృషి నేటికీ అనుసరణీయం అని అన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

జగజ్జీవన్‌రామ్ కోరుకున్న సమాజానికి బాటలు వేసిన వైఎస్‌ జగన్‌: లేళ్ళ అప్పిరెడ్డి
ఈ రోజు ప్రజా స్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ బాబూ జగజ్జీవన్‌రామ్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గతంలో సీఎంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, గత ఐదేళ్లలో సీఎంగా వైఎస్‌ జగన్ పాలనను చూస్తే ఎంతగా జగజ్జీవన్‌రామ్ వంటి మహనీయులు కోరుకున్న సమాజాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేశారో అర్థమవుతుంది. ఆనాడు బాబూ జగజ్జీవన్ రామ్ దేశంలోనే అత్యంత సమర్థ నాయకుడుగా అనేక శాఖలను పర్యవేక్షించడం ద్వారా తన పాలనకే వన్నె తీసుకువచ్చారు.

నిత్యం ఆయన సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. ఆ మార్పును ఈ రాష్ట్రంలో వైయస్ జగన్ తన పాలనలో ఆచరణలో చూపించారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు వంటి వారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ బడుగు వర్గాలను కించపరిచేలా మాట్లాడారు. అటువంటి వారు కూడా దురదృష్టవశాత్తు నేడు పదవుల్లో ఉండి, జగజ్జీవన్‌ రామ్ పేరు స్మరిస్తున్నారు. నిజంగా వారికి ఆ మహనీయుడి పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదు.

ఈ దేశంలో అనేక మంది సీఎంలుగా పనిచేశారు. కానీ చంద్రబాబు వంటి నీచమైన మనస్తత్వం ఉన్న సీఎంను ఎక్కడా చూడలేదు. పేదరికంలో ఉన్న అణగారిన వర్గాలపై ఆయనకు ఉన్న చులకన భావం పలు సందర్భాల్లో వెల్లడించారు. అసమానతలను లేని సమాజాన్ని చూడాలంటే తిరిగి వైయస్ జగన్ పాలనను తెచ్చుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

దళిత సమాజం చంద్రబాబును క్షమించదు: టీజేఆర్ సుధాకర్‌బాబు
ఈ దేశంలో దళితులను, అణగారిన వర్గాలను అభివృద్ధి వైపు నడిపించాలని బాబూ జగజ్జీవన్‌రామ్ వంటి మహనీయులు కృషి చేశారు. అటువంటి దేశంలోనే నేడు ముఖ్యమంత్రి వంటి పదవుల్లో ఉంటూ దళితులకు కనీసం ఒక మనిషిగా ఇచ్చే గౌరవం కూడా ఇవ్వని చంద్రబాబు వంటి వారు పాలన సాగిస్తున్నారు. కులాల మధ్య అంతరాలు తొలగించాలని, ఒక మంచి సమాజాన్ని సృష్టించాలని ఆనాడు జగజ్జీవన్‌ రామ్, అంబేద్కర్ వంటి వారు కాంక్షించారు.

కానీ ఏపీలో దురదృష్టవశాత్తు చంద్రబాబు వంటి అహంకారపూరిత నేతల పాలనలో దళిత సమాజం ప్రతిరోజూ అవమానానాలను ఎదుర్కొంటూనే ఉంది. ఆయన కేబినెట్‌లో పనిచేసిన వారు సైతం దళితుల పట్ల ఎంత నీచంగా మాట్లాడారో ప్రజలు అందరూ చూశారు. నిన్నకాక మొన్న దళితుడైన సింగయ్యను కుక్కతో పోల్చిన చంద్రబాబును దళిత సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. తన పాలనలో దళితుల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు, వారిని సమాజంలో అందరితో పాటు సగౌరవంగా నిలబెట్టేందుకు సీఎంగా వైయస్ జగన్ ప్రయత్నించారు. దళితులు గొప్ప చదువులు చదివేందుకు, ఉన్నత స్థానాల్లో నిలబడేందుకు వారికి అండగా నిలిచారని టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు.  

రాష్ట్రంలో బడుగుల హక్కులను కాల రాస్తున్న చంద్రబాబు: మేరుగు నాగార్జున
దళిత జాతుల కోసం అవిరళంగా కృషి చేసిన బాబూ జగజ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు. ఈ దేశంలో ఎక్కువ పోర్ట్ పోలియోలను సమర్థంగా నిర్వహించి, తన సామర్థ్యంతో ఈ దేశానికి గొప్ప సేవలు అందించిన నాయకుడు జగజ్జీవన్‌రామ్. ఈ దేశంలోని బడుగుల గురించి ఆలోచించిన నేత. సమాజంలో అసమానతలను రూపుమాపాలని ఆయన జీవితాంతం కృషి చేశారు.

ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను ఈ రాష్ట్రానికి అందించిన ఘనత వైయస్ రాజశేఖర్‌రెడ్డి, తరువాత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం అనే భేదాలు లేకుండా ఈ రాష్ట్రంలో పేదరికం నుంచి ప్రతి ఒక్కరినీ విముక్తులను చేసేందుకు అయిదేళ్ళ పాలనలో వైఎస్‌ జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు. నేడు చంద్రబాబు పాలనలో అణగారిన కులాలు మళ్ళీ చీకటిరోజుల్లోకి వెళ్ళిపోతున్నాయి.

బడుగు వర్గాలకు అందించాల్సిన అన్ని పథకాలను రద్దు చేయడం, వారి హక్కులను కాలరాయాడం ద్వారా రాక్షస పాలనను సాగిస్తున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుక్కతో పోల్చడం సిగ్గుచేటు. ఇదీ ఆయనకు దళితులంటే ఉన్న చులకన భావం. ఇటువంటి పాలనకు చరమగీతం పాడేందుకు బడుగువర్గాలు ఐక్యం కావాలి.

జగజ్జీవన్‌రామ్ ఆలోచనలను కొనసాగించిన నేతలు వైఎస్సార్‌, జగన్: నందిగం సురేష్‌
ఈ దేశానికి ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంంత కృషి చేసిన మహనీయుడు బాబూ జగజ్జీవన్‌రామ్. ఆయన ఆశయాలను ఆచరణలో చూసిన వారు ఆనాడు మహానేత స్వర్గీయ వైఎస్సార్‌  అయితే నేడు మాజీ సీఎం వైఎస్‌ జగన్. ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రగతివైపు నడిపించిన నాయకులు వారు. నేడు కూటమి పాలనలో ప్రతిరోజూ బడుగు, బలహీనవర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, వారికి అండగా నిలుస్తున్న నాయకుడు వైస్ జగన్. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ప్రజలు చూసిన ఎమర్జెన్సీని తిరిగి ప్రజలు చంద్రబాబు పాలనలో చూస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, తాడేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేమారెడ్డి, స్టేట్ స్పోక్స్ పర్సన్ వేల్పుల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement