ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..

Authorities Responsible For Enforcing Food Safety Act - Sakshi

హిందూపురం/లేపాక్షి: కేంద్ర ఆహార భద్రత చట్టం–13 అమలు బాధ్యత అధికారులదేనని ఆహార భద్రత కమిషన్‌ సభ్యురాలు కృష్ణమ్మ స్పష్టం చేశారు. స్థానిక లక్ష్మీపురంలోని వైఎస్సార్‌ ఆరోగ్యకేంద్రం, సింగిరెడ్డిపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం, సీపీఐ కాలనీలోని కస్తూరిబా విద్యాలయ, ఎంఎల్‌ఎస్‌ పాయింట్, చౌకధాన్య డిపోలను గురువారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రూ.వేల కోట్ల వ్యయంతో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాయన్నారు. ఆహార భద్రత  కింద అమలులో ఉన్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయన్నారు.

ఇందులో నాన్‌ ఎఫ్‌ఏసీ కింద సుమారు 56లక్షల కార్డుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్‌కార్డు అందజేస్తామన్నారు. ఎక్కడైనా అర్హులైన కార్డు రాకపోయినా, రేషన్‌ బియ్యంలో పంపిణీలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు లోపించినా వెంటనే  ఫుడ్‌కమిషన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ (155235)కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రధానమంత్రి మాతృయోజన పథకం కింద మొదటి, రెండవ కాన్పులకు అందిస్తున్న పారితోషికానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్‌ను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లేపాక్షిలోని  వీరభద్రస్వామి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వంశీ«కృష్ణారెడ్డి, డీఎం అశ్వత్థనారాయణ, ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి, నోడల్‌ ఆఫీసర్‌ గాయత్రి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, డాక్టర్‌ ఆనంద్, తహసీల్దార్‌ శ్రీనివాసులు, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఏడీ నాగరాజు, ఈడీ దివాకర్‌రెడ్డి, ఎంఈఓ గంగప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   

(చదవండి: కులాంతర వివాహంతోనే హత్య)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top