మూడు రాజధానుల దీక్షా శిబిరంపై దాడి.. చంద్రబాబు డైరెక్షన్‌ మేరకే

Attack On Ap Three Capitals Camp Under Chandrababu Direction - Sakshi

సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు

వాటిని వ్యతిరేకిస్తూ బహుజన పరిరక్షణ సమితి నేతల నిరసన 

శిబిరంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి అనుచరులు

మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగేసిన వైనం

ఈ గొడవను వైఎస్సార్‌సీపీ, బీజేపీ మధ్య ఘర్షణగా 

చిత్రీకరించేందుకు బాబు, పవన్‌ల యత్నం

చంద్రబాబు డైరెక్షన్‌ మేరకే దాడి : ఎంపీ నందిగం సురేష్‌

బహుజనులు నా పేరే ప్రస్తావించలేదు : బీజేపీ నేత సత్యకుమార్‌

ఘటనపై కేసు నమోదు : ఏఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ 

తాడికొండ/సాక్షి, అమరావతి : అమరావతి దీక్ష శిబిరంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి ఆది­నారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మూడు రాజ­ధానుల శిబిరం వద్ద నిరసన తెలిపిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలపై బీజేపీ ముసుగులోని టీడీపీ మాజీ మంత్రి అనుచరులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడులను బీజేపీ, వైఎస్సార్‌సీపీ మధ్య చోటుచేసుకున్న ఘర్షణగా చిత్రీకరిస్తూ టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు రాజ­కీయ డ్రామాకు తెరతీశారు.

2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డిని నాటి సీఎం చంద్రబాబు టీడీపీలోకి లాక్కుని.. మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2019లో అధికారం కోల్పోగానే చంద్రబాబు కనుసైగల మేరకే ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతి దీక్షలు 1200వ రోజుకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం మందడంలో నిర్వహి­స్తున్న కార్యక్రమాలకు ఆదినారాయణరెడ్డి.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కలిసి వెళ్లారు. ఆ శిబిరంలో సీఎం జగన్‌పై ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తాళ్లాయపాలెం జంక్షన్‌లోని మూడు రాజధానుల శిబిరంలో 915వ రోజు దీక్షలు చేస్తున్న బహు­జన పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలకు తెలిసింది.

కాసేపటి తర్వాత ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్, వారి అనుచరులు విజయవాడకు బయలుదేరారు. వారి వాహన శ్రేణి మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకోగానే.. బహుజన పరిరక్షణ సమితి నాయకులు రోడ్డు పక్కన నిల్చొని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆదినారా­యణ­రెడ్డి డౌన్‌ డౌన్‌.. అమరావతి వద్దు.. మూడు రాజధా­నులే ముద్దు.. అంటూ నినదించడంతో ఆదినారాయణరెడ్డి అనుచరులు వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై విరుచుకు పడ్డారు. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగారు. వారు ప్రతిఘటించడానికి సిద్ధమవుతుండగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ ఘటనకు కారణమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి ఆదినారాయణ­రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శామ్యూల్, కారుమూరి పుష్పరాజ్, ఇందుపల్లి సుభాషిణి, మల్లవరపు సుధారాణి, తదితరులు డిమాండ్‌ చేశారు. అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు శిబిరం వద్ద ఉన్న మహిళలను జుట్టు పట్టుకొని తన్నారని చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందన్నారు. 

ఆదినారాయణరెడ్డి కోసమే.. 
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీరుపై బహుజనులు నిరసన తెలపడంలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని బీజేపీ కార్యదర్శి సత్యకుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ ఘటన సమయంలో ‘నా పేరు ఎవరూ ఎత్తలేదు.. ఆదినారాయణరెడ్డి కోసమే ఆరా తీశారు. ఆయన నా కారు ఎక్కలేదు. ఉదయం నేను, ఆయన కలిసి వెళ్లాం. సభ నుంచి ఆయన కాస్త ముందుగా వచ్చారు. ఆ విషయం వారికి తెలియదు. ఎవరో నా కారుపై దాడి చేశారు’ అని వివరించారు. కాగా, సత్యకుమార్‌ కారుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందన్నారు.  

అమరావతి రైతులపై 3,500 కేసులా?
అమరావతి రైతులపై 3,500 కేసులు నమోదు చేశారని, ఇదెక్కడ న్యాయమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆది­నారాయణరెడ్డి ప్రశ్నించారు. అమరావతి దీక్షలు 1200వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు మండలం మందడంలోని దీక్షా శిబిరంలో శుక్రవారం ఆయన మాట్లా­డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్య­లు చేశారు. అమరావతి రైతులకు లీగల్‌గా, పర్సనల్‌గా, పార్టీ పరంగా, టెక్నికల్‌గా అన్ని విధాలా సాయం చేస్తామని స్పష్టం చేశారు. 

కేసు నమోదు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ పులిపాటి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో వెంటనే జోక్యం చేసుకుని, నివారించామన్నారు. గుర్తు తెలియని వ్యక్తి బీజేపీ నేత సత్యకుమార్‌ వాహనంపై రాయి విసిరి పొలాల్లోకి పారిపోయాడని చెప్పారు. తమపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానుల ఆందోళనకారులు ఫిర్యాదు ఇచ్చారని, ఈ ఘటనపై త్వరితగతిన దర్యాప్తు చేస్తామని తెలిపారు.
చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top