‘పరపతి’ పెంచుకున్న అక్కచెల్లెమ్మలు

Assurance in women of thrift societies with government support - Sakshi

గాడిన పడిన ‘డ్వాక్రా’ చెల్లింపులు

కరోనా కాలంలోనూ రుణాలు చెల్లించే మహిళల సంఖ్య భారీగా పెరుగుదల

ప్రభుత్వ ఆసరాతో పొదుపు సంఘాల మహిళల్లో భరోసా

సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పరపతి పెరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలు ఇప్పుడు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినా సకాలంలో వాయిదాలు చెల్లించే మహిళల సంఖ్య అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 6 లక్షలు పెరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు నిర్ధారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8,78,874 సంఘాల పేరిట తీసుకున్న రుణాలకు సంబంధించి ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు సక్రమంగా వాయిదాలు చెల్లించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9,34,852 సంఘాలకు చెందిన మహిళలు సకాలంలో రుణ కిస్తీ చెల్లించినట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం నాటి పరిస్థితులతో పోలిస్తే 20 లక్షల మందికి పైగా మహిళలు సక్రమంగా రుణ కిస్తీలు చెల్లిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.  

సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఆసరా పథకాలతో...  
గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సంఘాల్లో ప్రతి నెలా చేసుకోవాల్సిన పొదుపును కూడా మహిళలు పూర్తిగా పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో కొంత కాలంపాటు రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కటిగా చేపట్టిన చర్యలతో మహిళలు మళ్లీ పొదుపు సంఘాల కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనడం పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా చెల్లించడంతో పాటు పొదుపు రుణ వ్యవహారాలు యథావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో మహిళలకు నేరుగా చెల్లించే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటివరకు వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారానే పొదుపు సంఘాల మహిళలకు దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ చర్యలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. 

లక్ష సంఘాలకు రూ.10 లక్షలపైగా రుణాలు
ముందెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో పొదుపు సంఘాల మహిళలు సకాలంలో రుణ కిస్తీలు చెల్లిస్తుండటంతో బ్యాంకులు ఇప్పుడు ఒక్కొక్క పొదుపు సంఘానికి రూ.10 లక్షలకు పైబడి కూడా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు దాదాపు లక్ష సంఘాలకు రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొచ్చాయని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top