సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు | Sakshi
Sakshi News home page

సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు

Published Sun, Dec 4 2022 7:15 PM

Assurance Of Cultivation Extensive Crop Loans - Sakshi

వ్యవసాయరంగానికి జగన్‌ సర్కార్‌ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక  సంవత్సరం(2022–23)లో అంచనాకు మించి పంట రుణాలు మంజూరు చేసింది. రూ.11,957 కోట్ల వార్షిక రుణప్రణాళిక లక్ష్యంలో రెండో త్రైమాసికం ముగిసేలోపు అంటే సెప్టెంబర్‌ నెలాఖరుకే రూ.9,077 కోట్లతో    76 శాతం సాధించిన బ్యాంకర్లు గడువులోగా వంద శాతం సాధించే దిశగా అడుగులేస్తున్నారు. 

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటోంది. పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో ఇప్పించి వ్యవసాయం సాఫీగా సాగేలా చూస్తోంది. ఖరీఫ్‌లో సాగుకు వీలుగా ఏటా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,204.24 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 127 శాతంతో రూ.4,068.62 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,226.68 కోట్లు లక్ష్యంగా రబీ రైతులకు పంట రుణాల మంజూరు కొనసాగుతోంది. వ్యవసాయ టర్మ్‌ లోన్ల లక్ష్యం రూ.1,545.32 కోట్లు కాగా.. 121 శాతంతో రూ.1,869.81 కోట్లు మంజూరు చేశారు. ఇక అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.16.61 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రూ.92.18 కోట్లు ఇచ్చారు. ఇలా... మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రైతులు, ఇతర లబ్ధిదారులకు రూ.6,047.22 కోట్లు ఇవ్వడం గమనార్హం.  

ఇతరత్రా రంగాలకూ విరివిగా రుణాలు  
వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ విరివిగా రుణాలు అందించారు. అందులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.795.15 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల కింద రూ.97.61 కోట్లు, నాన్‌ ప్రయారిటీ సెక్టార్‌ కింద రూ.1,780.72 కోట్లకు గానూ 116 శాతంతో ఏకంగా రూ.2,081.90 కోట్లు మంజూరు చేశారు. ఇలా రూ.11,957.94 కోట్ల వార్షిక రుణప్రణాళిక (లోన్‌ క్రెడిట్‌ప్లాన్‌–2022–23) అమలులో భాగంగా రెండో త్రైమాసికం ముగిసేనాటికే 76 శాతంతో రూ.9,077.42 కోట్లు పూర్తయింది. 2023 మార్చి 31 వరకు గడువు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

పెరిగిన బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌  
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకులు దాదాపు 43 ప్రిన్సిపల్‌ బ్యాంకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల మంజూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రూ.1,567 కోట్లు, స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.1,429 కోట్లతో పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూనియన్‌ బ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), బ్యాంకు ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌     ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంకు, కరూర్‌ వైశ్యాబ్యాంకు, ఐడీబీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే... ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ.4,453 కోట్లు, ప్రైవేట్‌    వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,201 కోట్లు ఇవ్వగా తర్వాత గ్రామీణ, సహకార   బ్యాంకుల ద్వారా రైతులు, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాయి. 

రుణాల మంజూరుకు పోటీ 
రైతులతో పాటు అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల పురోభివృద్ధికి ఇటీవల కాలంలో బ్యాంకర్లు పోటీ పడి రుణాలు మంజూరు చేస్తుండటం మంచి పరిణామం. దీంతో వార్షిక లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించి గడువులోగా వంద శాతం చేరుకునే దిశగా రుణాల మంజూరు కొనసాగుతోంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, విద్యా, వాహన, గృహ, పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు... ఇలా అన్నింటికీ అవసరమైన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపుతున్నారు. 
– బి.నాగరాజారెడ్డి, 
లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ (ఎల్‌డీఎం) 

రూ.85 వేల పంట రుణం 
నాకు 2.75 ఎకరాల పొలం ఉంది. బొమ్మగానిపల్లి  కెనరా బ్యాంకులో రూ.85 వేల పంట రుణం ఇచ్చారు. దీని వల్ల సకాలంలో పంట పెట్టుబడికి ఉపయోగపడింది. 2021లో తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్‌ పంట రుణాల సున్నావడ్డీ కింద ఇటీవల రూ.3 వేల వడ్డీ రాయితీ కూడా జమ కావడం సంతోషంగా ఉంది.  
– విరుపాక్షి, రైతు, ముప్పాలకుంట, బ్రహ్మసముద్రం మండలం   

Advertisement
 
Advertisement
 
Advertisement