ఇక సచివాలయాల్లోనే నీటితీరువా చెల్లింపులు

Assignment of responsibilities to digital assistants Village secretariats - Sakshi

డిజిటల్‌ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగింత

ఇప్పటికే ఆయకట్టు రైతుల వివరాలు ఏపీ సేవ పోర్టల్‌లో నమోదు

ఇక చెల్లింపులకు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు

రైతులకు ఉన్న ఊర్లోనే నీటి తీరువా చెల్లించే అవకాశం

సాక్షి, అమరావతి: ఉన్న ఊళ్లో.. సమీప గ్రామ సచివాలయంలోనే నీటి తీరువా చెల్లించే సదుపాయాన్ని ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వీటి వసూలు బాధ్యతలను డిజిటల్‌ అసిస్టెంట్‌కు అప్పగించింది. అలాగే, గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయకట్టు రైతుల వివరాలను ఏపీ సేవ పోర్టల్‌లో ఇప్పటికే నమోదు చేసిన సర్కార్‌.. వాటి ఆధారంగా రైతుల నుంచి నీటి తీరువా వసూలుచేసి, అక్కడికక్కడే రసీదు ఇవ్వనుంది. అత్యంత పారదర్శకంగా వీటిని వసూలు చేయడంవల్ల రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఏపీలోనే నీటి తీరువా తక్కువ..
రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని చిన్న ఎత్తిపోతల కింద 7.86 లక్షల ఎకరాలు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగుకు నీటిని సరఫరా చేసినప్పుడు.. ఖరీఫ్‌ పంటకు రూ.200, రబీ పంటకూ రూ.200 చొప్పున నీటి తీరువాగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నీటి తీరువా అత్యంత తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం.

మండల కేంద్రాలకు వెళ్లక్కర్లేదు
ఇక నీటి సరఫరా ఆధారంగా ఆయకట్టు రైతుల నుంచి ఇప్పటిదాకా తహసీల్దార్‌ నేతృత్వంలో వీఆర్వోలు, ఆర్‌ఐలు ఈ నీటి తీరువాను వసూలు చేస్తున్నారు. తీరువా చెల్లించాలంటే రైతులు ఇప్పటివరకు మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా దేశంలో ఎక్కడాలేని రీతిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే 543కి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నారు. తాజాగా నీటి తీరువా చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top