తీవ్రమైన చలితో చిత్తూరు జవాను మృతి 

Army Jawan From Chittoor Lost life DueTo Heavy Cold In Kashmir - Sakshi

చంద్రగిరి : జమ్మూ–కశ్మీర్‌ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు గత 14 సంవత్సరాలుగా మిలటరీలో జవానుగా పనిచేస్తున్నాడు. శనివారం జమ్మూ–కశ్మీర్‌లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్డప్పనాయుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సహచరులు ఆయనకు ప్రథమ చికిత్సను అందించారు.

ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని, ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రెడ్డప్పనాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాతి్వక్, కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు రెడ్డప్పనాయుడుకు ఇటీవల పదోన్నతి లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబానికి ఇంతటి చేదు వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం మృతదేహం గడ్డకిందపల్లికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

అప్‌డేట్‌..
‘మంచు’లా కరిగిపోయాడు
ఇరవై ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. ఆయన చేసిన సేవలకు హవల్దార్‌గా పదోన్నతి లభించింది. మరో మూడేళ్లలో ఆయన సర్వీసు పూర్తి కానుంది. జనవరి 1న ఇంటికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. సంక్రాంతికి వస్తానని భార్య రెడ్డమ్మకు తెలిపారు. ఇంతలోనే శనివారం జమ్మూ–కశ్మీర్‌లో విధినిర్వహణలో చలి తీవ్రతకు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో భరతమాత ఒడిలో అశువులు బాశాడు ఆ వీరుడు. ఆ వీర సైనికుడే గడ్డకిందపల్లెకు చెందిన మంచురెడ్డెప్పనాయుడు. దేశ సేవలో ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు ఉద్వేగంగా తెలిపారు.

చంద్రగిరి: జమ్ము–కశ్మీరులో సైనికుడిగా దేశ సేవ చేస్తున్న గడ్డకిందపల్లెకు చెందిన రెడ్డెప్పనాయుడు(38) విధి నిర్వహణలో మృతి చెందాడన్న వార్త జిల్లా వాసులను కలచి వేసింది. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందçపల్లె్ల గ్రామానికి చెందిన మంచు రెడ్డెప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డెప్పనాయుడు. రెడ్డెప్పనాయుడు పెద్ద కుమారుడు కాగా, పురుషోత్తమ నాయుడు రెండో కుమారుడు. రెడ్డెప్పనాయుడు చిన్నప్పటి నుంచి దేశసేవ చేయాలని పరితపించేవాడు. ఇంటర్‌ తర్వా త ఆర్మీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆపై 2000 సంవత్సరంలో ఆర్మీకి ఎంపికై దేశ సేవ చేస్తున్నాడు. 20 ఏళ్ల సర్వీసులో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన సేవలను అందించారు. ప్రస్తుతం జమ్ము–కశ్మీర్‌లో విధుల్లో ఉన్నారు. జనవరి 1వ తేదీన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భార్య రెడ్డమ్మతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పాడు.

కుటుంబమంతా పండుగ చేసుకుని, నూతనంగా నిర్మించిన కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందామని తెలిపారు. శనివారం జమ్ము–కశ్మీర్‌లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో విధి నిర్వహణలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సహచరులు ప్రథ మ చికిత్సను అందించారు. పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో రెడ్డెప్పనాయుడు మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ వార్తను అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పిల్లలు రోదించడం గ్రామస్తులను కలిచివేసింది. మంగళవారం ఉదయం మంచురెడ్డప్పనాయు డు మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇరవై ఏళ్లుగా దేశ సేవ
20 సంవత్సరాలుగా నా బిడ్డ దేశానికి సేవ చేస్తున్నాడు. దేశ సేవలో అసువులు బా యడం గర్వంగా ఉంది. మీ కుమారుడు కన్నుమూశారని ఆర్మీ అధికారులు మాకు సమాచారం అందించారు. మంగళవారం భౌతికకాయాన్ని అప్పగిస్తామని చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నాం. 
– మంచు రెడ్డెప్పనాయుడు, తండ్రి

దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది 
దేశం కోసం నా భర్త చనిపోవడం గర్వంగా ఉంది. కానీ ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. లాక్‌డౌన్‌కు ముందు ఇక్కడకు వచ్చారు. కొత్త ఇంటిని నిర్మించుకున్నాం. అనంతరం హెడ్‌క్వార్టర్స్‌ నుంచి పిలుపు రావడంతో విధులకు వెళ్లారు. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త ఇంట్లో చేరి సత్యనారాయణ వ్రతం చేద్దామని ఆయన చెప్పారు. ఇంతలోనే అసువులు బాసారని తెలియడం మనోవేదనకు గురి చేస్తోంది.
– మంచు రెడ్డెమ్మ, భార్య  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top