‘అనంత’లో విద్యుత్‌ ప్రమాదాలకు అడ్డుకట్ట

APSPDCL CMD Santosh Rao On Power Accidents prevention - Sakshi

సబ్‌స్టేషన్లు, లైన్లలో లోపాలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దేందుకు చర్యలు

‘సాక్షి’తో ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు 

సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్‌: విద్యుత్‌ ప్రమాదాలకు అవకాశమున్న   ప్రాంతాలను, బలహీనంగా ఉన్న లైన్లను గుర్తించి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీ ఎస్పీడీసీఎల్‌) రంగంలోకి దిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహెూన్నూరు సమీపంలో విద్యుత్‌ ప్రమాదం నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సంస్థ సీఎండీ కె.సంతోషరావు మంగళవారం తెలిపారు.

అనంతపురం సర్కిల్‌ పరిధిలోని సబ్‌స్టేషన్లు, లైన్లను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదం జరిగేందుకు వీలున్న లైన్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం నుంచి సర్కిల్‌ ఇన్‌చార్జ్, నోడల్‌ ఆఫీసర్‌ కె.గురవయ్య(చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌/ఓఎం) నేతృత్వంలో అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు బాధ్యులుగా జి.బాలకృష్ణారెడ్డి (జనరల్‌ మేనేజర్‌/ఎనర్జీ ఆడిట్‌), కె.ఆదిశేషయ్య(సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌/అసెస్మెంట్, ఎంక్వైరీస్‌), సీహెచ్‌.రామచంద్రారావు (జనరల్‌ మేనేజర్‌/కమర్షియల్‌), జి.సత్యనారాయణ(జనరల్‌ మేనేజర్‌/ప్రాజెక్ట్స్), జె.రమణాదేవి (సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌/డీపీఈ), పి.మురళి (జనరల్‌ మేనేజర్‌/ప్లానింగ్‌)లను నియమిస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

వీరికి సహాయకులుగా నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు డీపీఈ డివిజన్ల అధికారులు విధులు నిర్వహిస్తారని, సర్కిల్‌ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు వీలుగా అనంతపురం టౌన్, అనంతపురం రూరల్, గుత్తి, కళ్యాణ దుర్గం, కదిరి, హిందూపురం డివిజన్లకు మీటర్స్, ప్రొటెక్షన్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను కేటాయించినట్లు వివరించారు. అధికారులంతా వారికి కేటాయించిన విధులకు తక్షణమే హాజరు కావాలని, ఈ పనులు పూర్తయ్యేవరకు వారంతా తమకు కేటాయించిన ప్రాంతంలోనే బస చేయాలని ఆదేశాలిచ్చామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top