1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్‌

APS RTC Employees To Get Govt Pay Scale From July 1st - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులు 52 వేల మంది జీవితాల్లో నూతన అధ్యాయమిది. జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఇప్పటివరకు కార్పొరేషన్‌ పే స్కేల్‌ ప్రకారం జీతాలు చెల్లించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కేడర్‌ నిర్ధారణను ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది. ఆమేరకు నూతన పే స్కేల్‌ను కూడా ప్రకటించింది. జూలై 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తామని తెలిపింది. 

నిర్ధారించిన కేడర్‌కు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు, ఇతర భత్యాలను ఉన్నతాధికారులు నిర్ణయించారు. జీతాల చెల్లింపు విధానంపై జిల్లాలు, డిపోలవారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పే స్లిప్‌ల తయారీ, ఇతర లాంఛనాలను పూర్తి చేశారు. తాజా పీఆర్సీ మేరకు ఏడాది కాలానికి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించి అమలు చేయనున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా అత్యధిక సంఖ్యలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సాధారణ, కిందిస్థాయి సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. 

కార్పొరేషన్‌ జీతాలకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా చెల్లించే జీతాలు ఎక్కువని అధికారవర్గాలు తెలిపాయి. ఏడీసీలుగా పదోన్నతి పొందిన  డ్రైవర్లు, కండక్టర్లకు కలిగే అదనపు ప్రయోజనాలపై తొలుత కొంత సందిగ్ధత నెలకొంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. దాంతో వారికి కూడా అదనపు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. మరోవైపు రాష్ట్ర ప్రధాన కేంద్రంలో.. అంటే విజయవాడలో పనిచేసే ఉద్యోగులందరికీ అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన దాదాపు 200 మంది ఉద్యోగులకే అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో విజయవాడలో పనిచేసే అందరికీ చెల్లిస్తారు. దీనివల్ల దాదాపు 500మందికి మరింత ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ పే స్కేల్‌తో ఆర్టీసీ ఉద్యోగులకు భవిష్యత్‌లో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని ఉద్యోగవర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top