విద్యుత్‌ ప్రమాదాలపై ఏపీఈఆర్‌సీ ఆందోళన | APERC concerned about electrical accidents | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలపై ఏపీఈఆర్‌సీ ఆందోళన

Jan 5 2025 5:18 AM | Updated on Jan 5 2025 5:18 AM

APERC concerned about electrical accidents

భద్రతా చర్యలను పెంచాలని విద్యుత్‌ సంస్థలకు ఆదేశం

ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర కో–ఆర్డినేషన్‌ ఫోరం

ఐదేళ్ల రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళికకు ఆమోదం

సాక్షి, అమరావతి/కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రంలో ఇటీవల విద్యుత్‌ ప్రమాదాల సంఖ్య పెరగడంపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి­(ఏపీఈఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. సక్రమ­మైన విద్యుత్‌ పంపిణీతో పాటు భద్రతా చర్యలను పెంచాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. శనివారం కర్నూలులో ఏపీఈఆర్‌సీ ఆధ్వ­ర్యంలో జరిగిన రాష్ట్ర కో–ఆర్డినేషన్‌ ఫోరం సమావేశంలో 2024–25 నుంచి 2028–29 వరకు 5వ నియంత్రణ కాలానికి సంబంధించిన రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళికను ఆమోదించారు. 

ఈ సందర్భంగా ఏపీఈఆర్‌సీ ఇన్‌చార్జ్‌ చైర్మన్, సాంకేతిక సభ్యుడు ఠాకూర్‌ రామసింగ్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్రమాదాలు తగ్గుముఖం పట్టేలా చూడాలని.. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం అందించాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశించారు. 

రబీ పంటల సీజన్‌తో పాటు వేసవిలో వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం కోసం విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

10,800 మెగావాట్ల అదనపు లోడ్‌..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ–2024ను రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళికలో చేర్చాలని ఏపీ ట్రాన్స్‌కోను ఏపీఈఆర్‌సీ గత సమావే­శంలో ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్‌కో తగిన మార్పులు చేసి ఈ సమావేశంలో ప్రవేశపెట్టింది. గతంలో కమిషన్‌ ఉత్తర్వులిచ్చిన రిసోర్స్‌ ప్లాన్‌లో ఇప్పటికే పరిగణించిన లోడ్‌కు అదనంగా 10,800 మెగావాట్ల వరకు లోడ్‌ పెరుగుతుందని ట్రాన్స్‌కో అందులో పేర్కొ­ంది. 

ఈ ప్రణాళికలను ప్రచురించడానికి ఫోరం ఆమో­దం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధా­న కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయా­నంద్, ఏపీఈఆర్‌సీ ఫైనాన్స్‌ మెంటర్‌ పీవీఆర్‌ రెడ్డి, డిస్కంల సీఎండీలు సంతోషరావు, రవి, పృథ్వీతేజ్, ఏపీ ట్రాన్స్‌­కో జేఎండీ కీర్తి, డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement