మా చావులకు కారణం కావొద్దు | AP Village and Ward Secretariat Employees JAC warns the government | Sakshi
Sakshi News home page

మా చావులకు కారణం కావొద్దు

Jun 8 2026 3:27 AM | Updated on Jun 8 2026 3:28 AM

AP Village and Ward Secretariat Employees JAC warns the government

సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి 

తీవ్ర పని ఒత్తిడితో 70 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు  

15వ తేదీలోపు సమస్యలు పరిష్కరించాలి 

లేకపోతే 16 నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తాం 

ప్రభుత్వానికి ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక

సాక్షి, అమరావతి/గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ‘నిర్దిష్ట సమయం ప్రకారం మా చేత పనులు చేయించుకోండి. అంతేగాని ఒకేసారి అన్ని పనులు పూర్తి చేయాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి మా చావులకు కారణం కావొద్దు. ఒత్తిడి భరించలేక ఇప్పటికే 70 మందికి పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిలో కొన్ని కూడా అమలు చేయలేదు. ఉద్యోగుల అసంతృప్తిని, ఆవేదనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నెల 15లోగా హామీలు అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. 

లేనిపక్షంలో 16వ తేదీ నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తాం’ అని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్లు, పెండింగ్‌ ఇంక్రిమెంట్లు, హేతుబద్దీకరణ, డెప్యుటేషన్లు, పెరుగుతున్న పని భారం, ఎన్నికల విధులపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. 

నిర్దిష్ట సమయం లేకుండా డ్యూటీలు 
రౌండ్‌ టేబుల్‌ సమావేశం అనంతరం జేఏసీ చైర్మన్‌ జి.సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్ట సమయం ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేస్తున్నారని చెప్పారు. దీంతో పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడితో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే 70 మందికి పైగా బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. కర్నూలులో సచివాలయ ఉద్యోగి మహమ్మద్‌ హుస్సేన్‌ కేవలం ఒత్తిడి కారణంగానే మృతి చెందాడని తెలిపారు. ఒక పని తర్వాత మరో పనిచేయడానికి తాము సిద్ధమేనని, అయితే, ప్రభుత్వం అన్ని పనులు ఒకేసారి చేయాలని ఒత్తిడి చేసి ఉద్యోగుల చావులకు కారణం కావొద్దని కోరారు. 

ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి 
జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్‌ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పదోన్నతుల అంశాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఉద్యోగులు ఇప్పటికే చేరుకున్న పే స్కేల్‌లోనే పదోన్నతులను చూపించడం వల్ల అసలు ప్రయోజనం లేకుండా పోతోందన్నారు.

జేఏసీ అసోసియేట్‌ చైర్మన్‌ పిల్లి హరీశ్‌ మాట్లాడుతూ హేతుబద్దీకరణ పేరుతో ఉద్యోగులను వివిధ కార్యాలయాలకు డెప్యుటేషన్‌పై పంపడం వల్ల వారి బాధ్యతలను సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులే నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పడుతోందన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు తమ శాఖల విధులతోపాటు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. 

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో బీఎల్‌వోలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇతర విధుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ కో–చైర్మన్లు చేవూరి వెంకట్, గంటా రామకృష్ణ, బెక్కం రవితేజ, పువ్వుల కిరణ్‌కుమార్, మేరిరాజు, హంపిరెడ్డి, శ్రీమన్నారాయణ, మణికంఠ, కిషోర్, హనుమంతరావు, మహబూబ్‌ సుభాని, కృష్ణచైతన్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement