మంగమారిపేటలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీకి ప్రణాళికలు

AP Tourism Dept Plan to Set up Entertainment city in Mangamaripeta Beach - Sakshi

రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మెగా టూరిజం కాంప్లెక్స్‌ 

25 ఎకరాల విస్తీర్ణంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పర్యాటక శాఖ

ఏపీయూఐఎఎంఎల్‌ సహకారంతో ప్రాజెక్టుకు రూపకల్పన

ఇప్పటికే పలు ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం 

సింగపూర్‌ వెళ్లే ప్రతి పర్యాటకుడూ సందర్శించే ఏకైక ప్రాంతం సెంటోసా దీవులు. భిన్నమైన పర్యాటక ప్రాంతాలన్ని ఒకే చోట కనువిందు చేసే ఈ ప్రాంతానికి వెళ్తే.. సరికొత్త ప్రపంచాన్ని చుట్టొచ్చినట్లే. సరిగ్గా ఇదే ఆలోచనతో సుందర నగరం విశాఖ తీరంలోనూ మెగా టూరిజం కాంప్లెక్స్‌కు పర్యాటక శాఖ శ్రీకారం చుడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 24 విభిన్న టూరిజం ప్రాజెక్టులు ఒకే చోట రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్నింటికి కేబినెట్‌ ఆమోదముద్ర లభించింది. త్వరలోనే స్టేక్‌ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నద్ధమవుతోంది.  


సాక్షి, విశాఖపట్నం:
భారత్‌కు వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో ఐదుగురు విశాఖ నగరాన్ని సందర్శిస్తుంటారు. అందుకే పర్యాటకంగా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సెంటోసా దీవుల తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి 16 కి.మీ, భీమిలి నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్‌ను ఎంపిక చేశారు.   


25 ఎకరాలు.. 24 ప్రాజెక్టులు.. రూ.700 కోట్లు 

మంగమారిపేట బీచ్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీకి రూపకల్పన చేశారు. ఈ మెగా టూరిజం కాంప్లెక్స్‌లో మొత్తం 24 విభిన్న తరహా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న భీమిలి–భోగాపురం ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌కు అనుసంధానంగా ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ రానుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు.. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాలతో టూరిజం అధికారులు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పార్కింగ్, ఫుడ్‌ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఎఎంఎల్‌) సహకారంతో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. 

 పలు ప్రాజెక్టులకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ 
ఇప్పటికే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీలో రానున్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం వేసింది. జెయింట్‌ వీల్, స్నో పార్క్, స్కై టవర్, టన్నెల్‌ అక్వేరియం వంటి ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం లభించింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను రూపొందించిన తర్వాత.. కేబినెట్‌ ముందుకు ఈ ఫైల్‌ రానుంది. కేబినెట్‌ ఆమోదం అన్నింటికీ లభించిన తర్వాత.. మెగా టూరిజం కాంప్లెక్స్‌కు వడివడిగా అడుగులు పడనున్నాయి. (క్లిక్: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం)

ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ విశేషాలు 
ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీలో టన్నెల్‌ అక్వేరియం, జెయింట్‌ వీల్, స్కైటవర్, స్నోవరల్డ్‌తో పాటు పలు అడ్వెంచర్‌ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఐస్‌ స్కల్ప్‌ చర్‌ పార్క్, అవుట్‌ డోర్‌ స్కై డైవింగ్, టెథర్డ్‌ గ్యాస్‌ బెలూన్, వేవ్‌ సర్ఫింగ్, ఎలివేటెడ్‌ ట్రాక్డ్‌ ట్రైన్, డైనోసర్‌ పార్క్, డైనోసార్‌ 5డీ ఇండోర్‌ షో, గ్లో గార్డెన్, మినియేచర్‌ వరల్డ్, గ్లాస్‌ వ్యూయింగ్‌ డెక్, ఈవెంట్‌ డోమ్, అవుట్‌డోర్‌ మువీ సిస్టమ్, పెర్‌ఫార్మెన్స్‌ థియేటర్, గ్లాస్‌ డెక్‌ రెస్ట్‌ అకామిడేషన్, ఫ్లోటింగ్‌ రెస్టారెంట్, బీచ్‌ రాంట్, వాటర్‌ బస్‌తో పాటు భిన్నమైన ఆటలు, చిల్డ్రన్‌ పార్క్, పిల్లల అడ్వెంచర్‌ గేమ్స్, ఇండోర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్, స్టార్‌ హోటల్స్, కన్వెన్షన్‌ సెంటర్‌లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం)

త్వరలోనే ఎంవోయూలు 
ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ కోసం మంగమారిపేటని గుర్తించాం. బీచ్‌రోడ్డులో కొంత భూమి కోతకు గురైన కారణంగా ఆరు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. భూ సేకరణకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయి. అవి త్వరలోనే పరిష్కృతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేపట్టాం. పెట్టుబడిదారుల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఇన్వెస్టర్స్‌ మీట్‌ నిర్వహించి ప్రాజెక్టు గురించి వివరించనున్నాం. ఇప్పటికే చాలా మంది ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీలో పెట్టుబడుల కోసం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఎంవోయూలు నిర్వహించి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. 
– శ్రీనివాస్‌పాణి, టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top