AP Police Constable Exam: ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతి ఉండదు | Sakshi
Sakshi News home page

పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష రేపు

Published Sat, Jan 21 2023 11:20 AM

AP Police Constable Preliminary Exam - Sakshi

ఒంగోలు టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాలకు ఈనెల 22 ఆదివారం నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షలకు అన్నీ రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్‌ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 22,281 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, వీరిలో పురుషులు 17,833 మంది, మహిళలు 4448 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు సబ్‌ డివిజన్‌ పరిధిలో 17, మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో 21 మొత్తం 38 కేంద్రాల్లో  పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను అనుమతిస్తారని, 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.  హాల్‌ టికెట్లలో పేర్కొన్న నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ వాచీలు, బ్లూ టూత్, కాలిక్యులేటర్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను అనుమతించేది లేదన్నారు.  

అమలులో 144 సెక్షన్‌:  
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించారని, స్ట్రాంగ్‌ రూంలు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారని వివరించారు. పోలీసు శాఖ అధికారులు, రీజినల్‌ కో ఆర్డినేటర్, సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు సమన్వయంగా విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఒంగోలులోని పరీక్ష కేంద్రాల వద్ద అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, మార్కాపురానికి అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్‌) ఎస్‌వీ శ్రీధరరావులను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల జిరాక్స్‌ షాపులను మూసి వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.  

ట్రాఫిక్‌ క్లియరెన్స్‌: 
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరడానికి మార్గమధ్యంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండుల వద్ద ప్రత్యేక హెల్ప్‌ డెస్‌్కలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని, మూడు నాలుగు కేంద్రాలకు క్లస్టర్‌ చేసి ఒక ఇన్‌స్పెక్టరును ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేలా ఫ్లయంగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

 
Advertisement
 
Advertisement