
ఇప్పటికే వైఎస్సార్‌సీపీ పిటిషన్.. వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం షురూ
కొనసాగుతున్న ఆందోళనలు
అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీకి ముస్లింల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ చట్టం అమలుకాకుండా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాని కోరుతూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో 13 వ్యాజ్యాలు వేయడం గమనార్హం. వక్ఫ్ సవరణ చట్టం అమలుతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ముస్లింలు ఓవైపు మసీదుల్లో సమావేశాలను నిర్వహిస్తునే మరోవైపు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
కేంద్రం వక్ఫ్ చట్టాన్ని సవరించి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం–2025ను అమలులోకి తేవడంపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, వారికి మద్దతుగా లౌకిక వాదులు, రాజకీయ పార్టీలు సైతం న్యాయపోరాటానికి దిగాయి. తమకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీకి ముస్లింలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ, వక్ఫ్ సవరణ చట్టం అమలును అడ్డుకోవాలంటూ సుప్రీంను ఆశ్రయించడాన్ని అభినందిస్తున్నారు. ఈ విషయంలో తొలి నుంచి టీడీపీ రెండు నాల్కల ధోరణి తేటతెల్లమైందని, ఇంకా ఆ పార్టీ సమర్థించుకోవడం సరికాదని మండిపడుతున్నారు.
మత స్వేచ్ఛ,మానవ హక్కులపై దాడి
ఏకపక్షంగా వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి తేవడం మత స్వేచ్ఛ, మానవ హక్కులు, రాజ్యాంగంపై మూకుమ్మడి దాడి. సవరణల సాకుతో స్వయం ప్రతిపత్తి కలిగిన వక్‌్పబోర్డ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. 44 సవరణలు అంటూ ఏకంగా 119 సవరణలు చేసి వక్ఫ్ పూర్తి స్వభావాన్ని దెబ్బతీశారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రా«థమిక హక్కులకు భంగం కలుగుతున్నందునే న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం.
ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రమే పెట్టి మత స్వేచ్ఛను దెబ్బతీయడం దారుణం. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులు, ఖబర్‌స్థాన్‌లు, మసీదులు, దర్గాలు, అషూర్‌ఖానాలు, మదరసాలు సైతం ప్రమాదంలో పడతాయి. సవరణ బిల్లును ఆపే అవకాశం ఉన్నా, అడ్డగోలుగా మద్దతిచ్చిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. – షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జేఏసీ కన్వినర్
వక్ఫ్ సవరణచట్టం రాజ్యాంగ విరుద్ధం
వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేలా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చే రాజకీయ నాయకుడని మరోసారి తేటతెల్లమైంది. ఆయన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మతపరమైన హక్కులకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన పలు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా కొత్త వక్ఫ్ సవరణ చట్టం రూపొందింది. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ స్టేట్ హజ్ కమిటీ మాజీ చైర్మన్

చంద్రబాబువి కల్లబొల్లి మాటలు
ముస్లింలపై ఈగవాలనివ్వబోమని ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న మోసపూరిత రాజకీయాలను ముస్లింజాతి ఎప్పటికీ క్షమించదు. ఇప్పటికైనా టీడీపీ వైఖరిని ముస్లిం సమాజం గుర్తించాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పాటుపడింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం గొప్ప విషయం. ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – షేక్ నాగుల్ మీరా, ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు
టీడీపీలోని ముస్లింలు ఆలోచించుకోవాలి
వక్ఫ్ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకుని టీడీపీలోని మైనార్టీ నేతలతో వైఎస్సార్‌సీపీపై బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. బాబు అవకాశవాద రాజకీయంపై టీడీపీలోని ముస్లింలు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ మాజీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాగజ్ ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్