ఆదర్శ పాఠశాలల పోస్టుల భర్తీ షెడ్యూల్‌ విడుదల

AP Model school Teacher Posts Recruitment Schedule Released - Sakshi

మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక

గెస్ట్‌ ఫ్యాకల్టీగా చేస్తున్న వారికి మెరిట్‌ ర్యాంకుల్లో ప్రాధాన్యత

కాంట్రాక్ట్‌ విధానంలో నియామకాలు

దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 7

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సురేష్‌ కుమార్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులకు ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ తెలిపారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం పోస్టుల భర్తీ షెడ్యూల్‌ విడుదల చేశారు. మొత్తం 282 పోస్టుల్లో 71 టీజీటీ కాగా 211 పీజీటీ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు http://cse.ap.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఇతర పద్ధతుల్లో వచ్చే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినా వారి దరఖాస్తులు తిరస్కరిస్తామన్నారు.]

ఇలాంటివారు ఒకవేళ ఎంపికైతే.. వారి నియామకాన్ని రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ వంటి చర్యలు చేపడతామని హెచ్చరించారు. అభ్యర్థులు తాజా పాస్‌పోర్ట్‌ సైజ్‌ఫొటో, సంతకాన్ని స్పష్టంగా కనిపించేలా ఆన్‌లైన్‌ దరఖాస్తులో అప్‌లోడ్‌ చేయాలన్నారు. స్పష్టంగా లేని దరఖాస్తులను తిరస్కరిస్తామని చెప్పారు. పోస్టుల భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. నోటిఫికేషన్‌ జారీ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా పేర్కొన్నారు.

ఎంపిక ఇలా..
అభ్యర్థుల ఎంపికకు జోన్ల వారీగా రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు (ఆర్జేడీలు) చైర్మన్లుగా.. జోన్‌ హెడ్‌క్వార్టర్‌ డీఈవో, ఆదర్శ పాఠశాలల అసిస్టెంట్‌ డైరెక్టర్, ప్రిన్సిపాల్‌ సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే పీజీటీలకు రూ.31,460, టీజీటీలకు రూ.28,940 చొప్పున నెలవారీ మినిమం టైమ్‌ స్కేల్‌ కింద వేతనం ఉంటుందన్నారు. ఎలాంటి అలవెన్సులు ఉండవని చెప్పారు. మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికలుంటాయని వెల్లడించారు. సంబంధిత అర్హతలు, మార్కుల శాతాన్ని అనుసరించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఇప్పటికే గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారికి మెరిట్‌ ర్యాంకుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉదాహరణకు వీరికి అర్హతల శాతం 55 ఉంటే దాన్ని 60 శాతంగా పరిగణిస్తారు.

అభ్యర్థులకు ఒకే ర్యాంక్‌ వస్తే ముందు ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు ఒకే రకంగా ఉంటే జెండర్‌ను అనుసరించి ముందు మహిళలకు అవకాశం ఉంటుంది. వయసు, జెండర్‌ ఒకేలా ఉంటే ముందు ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎంపికైనవారికి కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఒక ఏడాది ఒప్పందంతో నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎంపికయ్యాక ఆయా ఆదర్శ పాఠశాలలకు కేటాయించే టీచర్లతో ప్రిన్సిపాళ్లు రూ.100 నాన్‌ జ్యుడిషియల్‌ పేపర్లపై ఒప్పందం కుదుర్చుకోవాలి. కాగా, ఈ టీచర్ల వేతనాల చెల్లింపునకు రూ.2.60 కోట్లు అదనపు బడ్జెట్‌ కేటాయించాలని సురేష్‌ కుమార్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top