బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్‌ వేగంగా అడుగులు.. | AP Maritime Board Focus On Foreign Partnership | Sakshi
Sakshi News home page

బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్‌ వేగంగా అడుగులు..

Published Sat, Jun 11 2022 7:37 AM | Last Updated on Sat, Jun 11 2022 7:37 AM

AP Maritime Board Focus On Foreign Partnership - Sakshi

సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు విదేశీ పోర్టుల భాగస్వామ్య అంశాలపై దృష్టిసారించింది. యూరప్‌లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్‌లోని రోట్టర్‌ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్‌వెర్ప్‌లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తోంది. గత నెలలో దావోస్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రతినిధులు రోట్టర్‌ డ్యామ్, యాంట్‌వెర్ప్‌ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.

ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలను కోరినట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలపై రోట్టర్‌ డ్యామ్, యాంట్‌వెర్ప్‌ పోర్టు ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తంచేశాయని, త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖతను వ్యక్తంచేసినట్లు ఆయన తెలిపారు.

నౌకల తయారీ, రిపేరింగ్‌ రంగంలోనూ.. 
అదే విధంగా..  షార్జాకు చెందిన డామన్‌ షిప్‌యార్డ్‌ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగిందని, రాష్ట్రంలో నౌకల తయారీ, రిపేరింగ్‌ రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దావోస్‌ పర్యటన సందర్భంగా ఆయా పోర్టులను సందర్శించి స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, పోర్టు చైర్మన్లతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా దావోస్‌ పర్యటన అనంతరం విదేశీ పోర్టుల ప్రతినిధులను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తూ తాజాగా ఈ–మెయిల్స్‌ పంపామన్నారు. ఈ పర్యటనలో ఏపీ మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, మారిటైమ్‌ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, గత దుబాయ్‌ ఎక్స్‌పో సందర్భంగా షరాఫ్‌ గ్రూపు రాష్ట్ర లాజిస్టిక్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపించిందని, త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement