మత్స్య, ఆక్వా పెట్టుబడుల హబ్‌గా ఏపీ 

AP As Hub For Fisheries And Aqua Investments - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మత్స్య, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల హబ్‌గా నిలవబోతోందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) జాతీయ కమిటీ కో చైర్మన్‌ అరబింద్‌దాస్‌ చెప్పారు. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో అగ్రగామిగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సీఐఐ కట్టుబడి ఉందన్నారు. సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మత్స్య, ఆక్వారంగాల సుస్థిరాభివృద్ధిపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వారంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఐఐ కృషి చేస్తుందన్నారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీరం వెంబడి పెద్దఎత్తున మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తున్న ప్రభుత్వ తీరు ప్రశంసనీయమన్నారు.  

తీరం వెంబడి చేపల కేజ్‌ కల్చర్‌కు ప్రోత్సాహం  
ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ డిప్యూటీ సీఈవో లెఫ్టినెంట్‌ సి.డి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కోల్డ్‌ చైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిషింగ్‌ హార్బర్లు, ఇంటిగ్రేటెడ్‌ సీ పార్కుల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. తీరం వెంబడి చేపల కేజ్‌ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోందని చెప్పారు. మత్స్య, ఆక్వారంగాల్లో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఏపీæ ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.ఏంజెలి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సీఐఐ రాష్ట్రశాఖ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ మత్స్య రంగాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి లోతైన, వ్యూహాత్మక ఆలోచన ఉందని చెప్పారు. ఈ రంగంపై ఆధారపడిన వర్గాల జీవనోపాధికి, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగకల్పన, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ తమకు స్ఫూర్తినిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖతో పాటు ఈ రంగంలోని వాటాదారులందరితో సీఐఐ కలిసి పనిచేస్తుందని చెప్పారు. వాటర్‌బేస్‌ లిమిటెడ్‌ సీఈవో రమాకాంత్, డెల్టా ఫిష్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. 

ఫిష్‌ బాస్కెట్‌గా రాష్ట్రం 
సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా ఫిష్‌ బాస్కెట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు.  హేచరీలు, విత్తన పెంపకం, బ్రూడ్‌ బ్యాంకులు, బ్రూడ్‌ స్టాక్‌ మల్టిప్లికేషన్‌ సెంటర్లు, న్యూక్లియర్‌ బ్రీడింగ్‌ సెంటర్లు, పంట అనంతర నష్టాన్ని తగ్గించడానికి తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. పంటకోతకు ముందు, అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటురంగ పాత్ర చాలా కీలకమన్నారు. సప్లయి చైన్‌ను బలోపేతం చేయడం ద్వారా చేపలు, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top