
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పీతల హేచరీ ప్రైవేట్ పరం
గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఏర్పాటుకు చర్యలు
చిర్రయానాంలో ఐదు ఎకరాల స్థలం గుర్తింపు
ఎన్‌ఎస్‌డీబీ నిధులు రూ.2.75 కోట్లు కేటాయింపు
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ స్థలం ప్రైవేట్ సంస్థకు అప్పగింత
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పీతల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ప్రైవేట్ హేచరీలు నాసిరకం వనామీ రొయ్యల సీడ్ అందించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పీతల హేచరీని అటకెక్కించి... ప్రైవేట్ హేచరీకి ఇటీవల కేబినేట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు, కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాకినాడ, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో రైతులు 2వేల ఎకరాల్లో పచ్చపీత (మండపీత– సిల్లా సెరాట) సాగు చేస్తున్నారు.
ఈ పీతలకు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌లో డిమాండ్ అధికంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పీత సైజు, బరువును బట్టి కేజీ రూ.1,100 నుంచి రూ.1,500 వరకు ఉంటోంది. స్థానికంగా రూ.600 నుంచి రూ.900 వరకు ఉంది. పచ్చ పీత సీడ్ స్థానికంగా అందుబాటులో లేదు. చెన్నైలో ఉన్న దేశంలోని ఒకే ఒక్క హేచరీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఒక్కో పీత పిల్ల ధర రూ.12 వరకు ఉండగా, రవాణా, ఎగుమతి ఖర్చులు అదనం. బుక్ చేసిన ఆరు నెలలకు పీత పిల్లలు వస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హేచరీ ఏర్పాటుకు చర్యలు
పచ్చపీత సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా కాట్రేనికోన మండలం చిర్రయానాంలో రాష్ట్రంలోనే తొలి (దేశంలో రెండోది) హేచరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో ఐదు ఎకరాల్లో పీతల హేచరీ నిర్మాణం కోసం ఎన్‌ఎస్‌డీబీ నిధులు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది.
పర్యావరణం, అటవీ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించింది. అప్పట్లో మూడు నుంచి ఆరు నెలల్లో పీతల హేచరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పిల్లలను స్థానిక రైతులతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. ఈ హేచరీలో ఏడాదికి 1.5 మిలియన్ పిల్లల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు.
కూటమి రాగానే ప్రైవేట్ దిశగా
రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి.డోలాశంకర్ ఇటీవల జిల్లా మత్స్యశాఖ జేడీ ఎన్.శ్రీనివాస్‌తో కలిసి చిర్రయానంలో పర్యటించి పచ్చపీతల హేచరీకి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు, యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి ప్రోగ్రామ్ ప్రతినిధి డాక్టర్ సుదీప్ (ఢిల్లీ), బీఎస్ ప్రాజెక్టు స్టేట్ మేనేజర్ ఎన్.ఉషా కూడా ఇక్కడికి వచ్చారు. దీంతో ప్రభుత్వ హేచరీ ఏర్పాటు చేస్తారని, తమ కష్టాలు తీరతాయని పీతల సాగుదారులు ఆశించారు.
కానీ, గత గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇక్కడ సేకరించిన ఐదు ఎకరాల భూమిని ఫ్లూటస్ ఆక్వా సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. పెద్దాపురానికి చెందిన ఒక టీడీపీ నేత ఒత్తిడితో ఆ స్థలంలో పీతల హేచరీ ఏర్పాటుకు ఫ్లూటస్ ఆక్వా సంస్థకు అనుతిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ హేచరీ వల్ల వనామీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమకు కూడా తప్పవని పీతల సాగుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.