ఏపీ నుంచి ఖమ్మంలో పట్టుబడిన ఇసుక లారీ
ఏపీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న మాఫియా
కొవ్వూరు నుంచి తెలంగాణకు గోదావరి ఇసుక
ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న బినామీలు
ఆదివారం రాత్రి పోలీసులకు పట్టుబడిన టిప్పర్లు
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రీచ్ నుంచీ అక్రమ రవాణా
ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి దందా
భారీ వాహనాల్లో తరలింపు.. అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం
సాక్షి ప్రతినిధులు మహబూబ్‌నగర్/ఖమ్మం/సత్తుపల్లి: ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ సరిహద్దులు దాటి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల మీదుగా లారీలు తెలంగాణలో ప్రవేశిస్తున్నాయి. ఏపీలోని తాడిపత్రిలో ఉన్న ఓ అధికారిక రీచ్ నుంచి కర్నూలు మీదుగా వాహనాలు వస్తున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా గుండా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని గద్వాల, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, ఆదిభట్ల తదితర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లోని పలు చోట్లకు ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం 70 నుంచి 90 వరకు బెంజ్ వాహనాల్లో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో బినామీలు రెచ్చిపోతున్నారు. గోదావరి ఇసుకను దర్జాగా ఏపీ సరిహద్దు దాటిస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే బినామీలకు చెందిన ఇసుక టిప్పర్లు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టుబడడం గమనార్హం. కాగా ఏపీకి చెందిన నేతలు ఈ విధంగా ఇష్టారాజ్యంగా ఇసుక దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాడిపత్రి నుంచి యధేచ్చగా..
అనంతపురం జిల్లా తాడిపత్రి రీచ్ వద్ద ఒక లారీ లేదా బెంజ్ లోడ్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ధర తక్కువగా ఉండడంతో కన్నేసిన ఇసుక మాఫియా అక్కడి నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి టన్ను రూ.1,800 నుంచి రూ.2,400 వరకు విక్రయిస్తూ సొమ్ము చోసుకుంటున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలు సరిహద్దులోని పుల్లూరు టోల్‌ప్లాజా దాటేలా అక్రమార్కులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
ఈ సమయంలో గస్తీ నామమాత్రంగా ఉండడంతో ఇసుక వాహనాలు సులువుగా సరిహద్దులు దాటుతున్నాయి. ఎక్కువగా 16 టైర్ల లారీల్లోనే ఇసుకను తరలిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 16 టైర్ల వాహనంలో 47 టన్నులు, 14 టైర్ల వాహనంలో 42 టన్నులు, 12 టైర్ల వాహనంలో 36 టన్నులు, 10 టైర్ల వాహనంలో 28 టన్నుల ఇసుకను మాత్రమే తరలించాలి. కానీ ఆయా వాహనాలను రీడిజైన్ చేసి.. సామర్థ్యానికి మించి 35 నుంచి 45 శాతం మేర అధికంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కూటమి పార్టీ వ్యక్తి, స్థానిక నేత కుమ్మక్కు
ఇసుక దందా వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీకి చెందిన ఒక వ్యక్తి.. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సమీప బంధువులని కూడా సమాచారం.
నెల రోజులుగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను తరలిస్తున్న పది వాహనాలను స్థానిక పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇటు పోలీసులు, అటు రవాణా శాఖ చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాత్రివేళ దొంగ చాటుగా ఇసుక లారీలు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో టోల్‌ప్లాజా వద్ద గస్తీ పెంచామని జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.
ఏజెంట్ల ద్వారా వ్యవహారం
ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో లోడ్ చేస్తున్న గోదావరి ఇసుకను ఆర్డర్ల ఆధారంగా టిప్పర్లు, లారీల్లో సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్‌కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఇందులో ఏలూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టన్ను రూ.250 చొప్పున టిప్పర్లలో 40 – 50 టన్నుల వరకు లోడ్ చేసి, సత్తుపల్లిలో టన్ను రూ.1,200 చొప్పున, ఖమ్మంలో రూ.1,600 – రూ.1700, అదే హైదరాబాద్‌కు తీసుకెళ్తే రూ.2,500కు అమ్ముతున్నారు.
ఏపీలోని ఏలూరు జిల్లాకు ఆనుకుని తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తుపల్లిలో కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి కనుసన్నల్లో ఆయన బినామీలు వ్యవహారం నడిపిస్తున్నారు. టిప్పర్లు రాగానే వేగంగా అన్‌లోడ్ చేసేలా ఈ ఏజెంట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పూర్వపు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ఎమ్మెల్యే బినామీలే
ఇటీవల ఏపీలో రూ.100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేకు చెందిన బినామీలే ఇసుక దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక టిప్పర్లు కూడా ఆ ఎమ్మెల్యేకు చెందిన నియోజకవర్గాల్లోని వ్యక్తులవే కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అయితే రెండురోజుల క్రితం ఆ ఎమ్మెల్యే హడావుడిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తన పేరు చెప్పుకుని కొందరు ఇసుక, మట్టి దందా చేస్తున్నారని.. వారికి, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం విశేషం.
కాగా ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారంతో నిఘా వేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు..ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని గంగవరం రాజవరం గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్ పేరుతో ఉన్న ఏపీ 39 డబ్ల్యూహెచ్ 7666, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామానికి చెందిన కరకం శ్రీనివాస్ పేరిట ఉన్న ఏపీ 36డబ్ల్యూజీ 9666 టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా ఆదివారం రాత్రి పట్టుకోవడం గమనార్హం.


