కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

AP High Court sensational verdict on Compassionate Appointment - Sakshi

ఇదెక్కడి న్యాయం.. ఇదేం వివక్ష?

ప్రభుత్వోద్యోగి మరణిస్తే వెంటనే కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు..

అదే ఉద్యోగి కనిపించకుండా పోతే ఏడేళ్ల వరకు కారుణ్య నియామకం ఉండదు

పైపెచ్చు ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలిఉండాలి

ఈ నిబంధన అన్యాయం.. రాజ్యాంగ విరుద్ధం.. ఏకపక్షం కాబట్టి కొట్టేస్తున్నాం

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి.. హైకోర్టు సంచలన తీర్పు

సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోయినప్పుడు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని, అప్పుడు మాత్రమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకం కింద ఉద్యోగానికి అర్హులవుతారన్న నిబంధనను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ నిబంధన ఏకపక్షమని, అన్యాయమని పేర్కొంటూ దాన్ని కొట్టేసింది.

ఈ నిబంధనను కారణంగా చూపుతూ.. కనిపించకుండాపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఎఫ్‌ఐఆర్‌ నాటికి ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదన్న కారణంతో అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తూ అధికారులు జారీ చేసిన మెమోను రద్దు చేసింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్‌ శ్రీనివాసరావు పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, అతడికి సరిపోయే పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్‌ శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

ఇదీ వివాదం..
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో టి.సుబ్బారావు ప్లాంట్‌ అటెండెంట్‌గా పనిచేస్తూ 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. దీనిపై సుబ్బారావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో సుబ్బారావు అదృశ్యాన్ని ‘అన్‌ డిటెక్టబుల్‌’గా పేర్కొంటూ తుది నివేదిక దాఖలు చేశారు. 2002 అక్టోబర్‌లో ఇదే విషయాన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అధికారులకు తెలియచేశారు.

ఈ నేపథ్యంలో సుబ్బారావు కుమారుడు టి.శ్రీనివాసరావు కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి కనిపించకుండా పోయి ఏడేళ్లు అయిందని, అందువల్ల తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే అదృశ్యంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదంటూ శ్రీనివాసరావు దరఖాస్తును థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అధికారులు తోసిపుచ్చారు. దీనిపై శ్రీనివాసరావు 2012లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తుది విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు.

నిబంధనల పేరుతో ఈ వివక్ష ఏమిటి?
‘ప్రభుత్వోద్యోగి మరణిస్తే అతని కుటుంబంలో అర్హులకు కారుణ్య నియామకం కింద వెంటనే ఉద్యోగం దొరుకుతోంది. మరణించిన ఉద్యోగికి ఎంత సర్వీసు మిగిలి ఉందన్న విషయంలో కండీషన్లు లేవు. ఉద్యోగి మరణించిన ఏడాది లోపు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు పెట్టుకుంటే చాలు. అదే.. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోతే అతని కుటుంబంలో ఎవరైనా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలుండటం తప్పనిసరి.

ఆ ఉద్యోగిని చనిపోయినట్టు ప్రకటించాలంటే ఏడేళ్లు వేచిచూడాలి. ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే. అలాంటప్పుడు నిబంధనల పేరుతో ఈ వివక్ష ఏంటి? కారుణ్య నియామకానికి సంబంధించి ప్రభుత్వ విధానం అందరికీ ఒకేలా ఉండాలి. అంతే తప్ప మరణించిన ఉద్యోగి విషయంలో ఓ రకంగా, కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో మరోలా ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు మార్గదర్శకాలు తేవాలి’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top