ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు.. ఎస్‌ఈసీని ఆదేశించలేం

AP High Court refuses to direct SEC to conduct MPTC, ZPTC Elections - Sakshi

నిమ్మగడ్డ రమేశ్‌పై పిటిషనర్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు

వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చి పక్షపాతం, దురుద్దేశాలు ఆపాదించారు

మధ్యంతర ఉత్తర్వులిచ్చే ముందు ఆయన కౌంటర్‌ వేసేందుకు అవకాశమివ్వాలి

ఆరోపణలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది

అందువల్ల ప్రభుత్వాన్ని, నిమ్మగడ్డను కౌంటర్‌ దాఖలుకు ఆదేశిస్తున్నాం

ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు

న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని లేదా మూడ్రోజుల పాటు సెలవుపై వెళ్తుండటాన్ని బట్టి ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకున్నారన్న ప్రాథమిక నిర్ణయానికి రాలేమని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాక.. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంతో పాటు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అలాగే దురుద్దేశాలు ఆపాదించినందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే ముందు కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ ఈ దశలో కోరజాలరని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 

కమిషన్‌ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు
పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని మరిన్ని ఇబ్బందుల నుంచి తప్పించేందుకే నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నికల నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం విచారణ జరిపి నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమైనవి కావని, వాటిపై సమీక్ష చేయవచ్చునని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలతో ఈ న్యాయస్థానం ఏకీభవిస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని తెలిపారు. 

నిమ్మగడ్డపై ఆరోపణలు చాలా తీవ్రమైనవి
‘ఇక ఈ వ్యాజ్యంలో చేసిన ఆరోపణల విషయానికొస్తే.. ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం అవి చాలా తీవ్రమైనవి. నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఆయనకు పక్షపాతాన్ని ఆపాదించారు. ఈ పక్షపాతానికి కొన్ని ఘటనలను కూడా ఉదహరించారు. అధికార పార్టీపట్ల శత్రుభావంతో వ్యవహరించారని ప్రమాణ పూర్వకంగా ఈ వ్యాజ్యంలో చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్‌ తీరును మోసపూరితంగా, దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా, అక్రమాలుగా వర్గీకరించారు. కౌంటర్లు ఆహ్వానించిన తరువాత వీటన్నింటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నది ఈ కోర్టు అభిప్రాయం. ఈ విషయంలో ముఖ్యంగా నిమ్మగడ్డ రమేశ్‌ నుంచి కౌంటర్‌ ఆహ్వానించాలి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి (ఈనెల 18) ముందు ప్రస్తుత పిటిషన్‌ దాఖలైంది. సాధారణంగా ఓ అధికార వ్యవస్థ తీసుకున్న నిర్ణయం తప్పయితే, తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆ వ్యవస్థను ఈ న్యాయస్థానం ఆదేశించగలుగుతుంది. అంతేతప్ప దానిని ఫలానా విధంగా చేసి తీరాలని ఆదేశించలేదు. ప్రస్తుత కేసులో నిమ్మగడ్డ రమేశ్‌పై తీవ్రమైన ఆరోణలున్న నేపథ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు కోరే హక్కు పిటిషనర్‌కు లేదు’.. అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top