వివరాలు లేకుండా పిల్‌ ఎలా వేస్తారు?

AP High Court Comments On petitioner for filing the petition erring on govt part - Sakshi

అడిగితే ‘సమాచార’ చట్టం కింద దరఖాస్తు చేశామంటారా? 

పిటిషనర్‌పై హైకోర్టు అసహనం

విచారణ గురువారానికి వాయిదా 

సాక్షి, అమరావతి: కనీస వివరాల్లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడంపై హైకోర్టు సోమవారం పిటిషనర్‌ను నిలదీసింది. ప్రాథమిక సమాచారం లేకుండా పిల్‌ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి పిల్‌లతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని న్యాయస్థానం హెచ్చరించింది. అనంతరం.. వివరాలు సమర్పించేందుకు పిటిషనర్‌ గడువు కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌కు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని, ఆ వివరాలు రావాల్సి ఉందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

ఎన్నికల కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌పై..
పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్‌ గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగంలోని అధికరణ 243(కే) కింద ఉన్న అధికారాలను సవరిస్తూ పార్లమెంట్‌లో పెట్టిన బిల్లు, తదనంతర పరిణామాలను తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ వివరాలు తెలియకుండా ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంది. సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎస్‌ఈసీ గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ న్యాయవాది ఆర్‌.మహంతి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నవంబర్‌ 17న జారీ చేసిన ఉత్తర్వులను ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు సవాల్‌ చేయడం ఏమిటని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపింది. 243కేను సవరించారా? బిల్లు తరువాత పరిణామాలు తెలియకుండా వ్యాజ్యాన్ని ఎలా విచారించగలమని ప్రశ్నించింది. బిల్లు, తరువాతి పరిణామాలన్నింటినీ తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top