ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చాం

AP Govt report to High Court on Anandaiah Ayurvedic Medicine - Sakshi

5 రకాల మందుల్లో కె మందు శాంపిళ్లు ఆనందయ్య ఇవ్వలేదు

ఆ శాంపిల్స్‌ ఇస్తే పరీక్షించి చెబుతాం

ఐ డ్రాప్స్‌పై తుది పరీక్షలు చేయాలి

హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం

తదుపరి విచారణ 3కు వాయిదా

సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బి.ఆనందయ్య కోవిడ్‌ మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించకపోవడంతో పంపిణీని తాత్కాలికంగా ఆపామని, భవిష్యత్తులో ఇబ్బందులు ఉం డకూడదని మందు శాస్త్రీయతను నిపుణులతో పరిశీలింప చేశామని పేర్కొన్నారు. కంట్లో వేసే ఐ డ్రాప్స్‌తో సహా పి, ఎఫ్, ఎల్, కె పేరుతో ఆనంద య్య మొత్తం 5 రకాల మందులు తయారు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఐ డ్రాప్స్, కె రకం మందు మినహా మిగిలిన 3 రకాల మందుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. పి, ఎఫ్, ఎల్‌ మందుల వల్ల దుష్ప్రభావాలు కలగడం లేదని ఆయుష్‌ విభాగం నివేదిక ఇచ్చిందన్నారు. ఐ డ్రాప్స్‌పై తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కె రకం మందు శాంపిల్స్‌ను ఆనందయ్య ఇవ్వలేదని, అందువల్ల ఆ మందును పరీక్షించలేదని చెప్పారు.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఐ డ్రాప్స్‌తో పాటు కె మందు పంపిణీకి అనుమతులిచ్చే విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఐ డ్రాప్స్, కె రకం మందుపై పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. మందు పంపిణీ చేసే చోట కోవిడ్‌ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా, తనకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ విజయలక్ష్మి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.

ఈ మందు తయారీకి లైసెన్స్‌ అవసరం లేదు
ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ ఆనందయ్య మందు తయారీకి లైసెన్స్‌ అవసరం లేదన్నారు. ఫార్ములా చెప్పాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పా రు. శాంతిభద్రతల పేరుతో మందు పంపిణీని అధికారులు అడ్డుకుంటున్నారని, మందు పంపిణీకి అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ ఆనందయ్య మందు తీసుకున్న వారిలో దాదాపు 130 మంది నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌ తీసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కోటయ్య తరువాత ప్రభుత్వాస్పత్రిలో చేరి సోమవారం మరణించారని చెప్పారు. ఆనందయ్య వద్ద పనిచేస్తున్న వారిలో కూడా కొందరు కోవిడ్‌ బారిన పడ్డారన్నారు. ఔషధాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలని, లేకపోతే బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన పీవీ కృష్ణయ్య స్పందిస్తూ.. కోటయ్య మృతిపై సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. మరో పిటిషనర్‌ న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. కోవిడ్‌కు నిర్దిష్టంగా మందు లేదని, అందువల్ల ఆనందయ్య తయారుచేసే సంప్రదాయ మందు పంపిణీకి అనుమతించాలని కోరారు.

ఐ డ్రాప్స్‌ విషయంలోనే సమస్య
కె రకం మందు, ఐ డ్రాప్స్‌ విషయంలో నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందని ధర్మాసనం ప్రశ్నిం చింది. కె రకం మందు శాంపిల్స్‌ ఆనందయ్య ఇచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని సుమన్‌ తెలిపారు. ఐ డ్రాప్స్‌ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం చెబుతామన్నారు. ఐ డ్రాప్స్‌ నేరుగా కంటి నరాల్లోకి వెళతాయని, అందువల్ల అత్యంత శుభ్రమైన వాతావరణంలో తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆనందయ్య న్యాయవాది అశ్వనీకుమార్‌.. ఐ డ్రాప్స్‌ వల్ల ఆక్సిజన్‌ స్థాయిలు పెరుగుతాయని, అందువల్ల వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు. తుది పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతున్నప్పుడు అంత తొందర ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు మూడు వారాలు వేచి చూడటంలో తప్పేమీ లేదంది. ఐ డ్రాప్స్‌ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదుపరి విచారణలో చెప్పాలని ధర్మాసనం సుమన్‌కు సూచించింది. ఐ డ్రాప్స్, కె రకం మందు విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అడ్డుకోవడం లేదు..
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ స్పం దిస్తూ.. ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకోవ డం లేదన్నారు. పంపిణీ సమయంలో కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు కాకపోవడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆనందయ్యను కోరామని చెప్పారు. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి విషయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం కొనసాగుతోందని, ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరారు. దర్మాసనం అంగీకరిస్తూ విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణలో.. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సుమన్‌ తెలిపారు. 688 మందితో ఆయుర్వేద నిపుణులు మాట్లాడారని, ఆనందయ్య మందు వల్ల దుష్ప్రభావాలు కలగలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్, ఎస్‌పీకి తగిన మార్గదర్శకాలు జారీచేస్తారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top