ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు

AP Govt Is Planning To Build 16 Medical Colleges In AP - Sakshi

రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి

అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు

రూ.7,500 కోట్లతో వైద్య విద్యారంగంలో పెను మార్పులకు ప్రభుత్వం శ్రీకారం

పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీలు ఇప్పటికే జ్యుడిషియల్‌ ప్రివ్యూకు

త్వరలోనే మిగతా కళాశాలలు కూడా

జనవరిలోగా అన్నిటికీ టెండర్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్ల వ్యయంతో ఒకేసారి ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వైద్య విద్యా రంగంలో పెను మార్పులకు దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం జగన్‌ వైద్య విద్యా రంగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రభ్వుత్వ సామాజిక బాద్యతగా చేపట్టి భావి తరాల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై పలు సార్లు సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. 

కార్పొరేట్‌కు ధీటుగా 50 ఎకరాల్లో..
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మెడికల్‌ కాలేజీని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు కూడా ఏర్పాటవుతాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీలపై జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఆమోదం కోసం పంపారు. పాడేరు, మచిలీపట్నం కాలేజీలపై కూడా ఈ నెలలోనే జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపనున్నారు. ఈ నాలుగు కాలేజీలకు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం బాపట్ల మెడికల్‌ కాలేజీల జ్యుడీషియల్‌ ప్రివ్యూ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్‌లో టెండర్లను ఆహ్వానించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై జ్యుడీషియల్‌ ప్రివ్యూ అనంతరం జనవరిలో టెండర్లు ఆహ్వానించేలా కార్యాచరణ రూపొందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top