‘పొదుపు’ డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ!

AP Govt Measures to convince Centre, RBI, Banks DWCRA Groups - Sakshi

దాచుకున్న డబ్బులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు 

గ్రామీణ ప్రాంతాల్లో ఈ ‘పొదుపు’ మొత్తం రూ.11,916 కోట్లు 

ఇప్పటివరకు పొదుపు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకుల ఆంక్షలు

బ్యాంకుల్లో పొదుపు డబ్బులకు తక్కువ వడ్డీ.. రుణాలపై మాత్రం రెండింతలు అధికంగా..

తమ పొదుపు డబ్బులు వినియో­గిం­చుకున్నాక అవసరమైతే రుణం

ఇలాచేస్తే తగ్గనున్న వడ్డీ భారం 

ఈ దిశగా జగన్‌ సర్కారు యత్నాలు 

కేంద్రం, ఆర్‌బీఐ, బ్యాంకులను ఒప్పించేందుకు చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం పర్యటన

త్వరలో సానుకూల నిర్ణయానికి చాన్స్‌

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహి­ళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్ప­టివరకు ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసు­కుంటున్న రుణ మొత్తంలో దాదాపు మూడో వంతుకు  సమానమైన డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో పొదుపు రూపంలో పోగుపడి­నప్పటికీ.. ఆ మొత్తానికి నామ­మాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు. కానీ, బ్యాంకుల నుంచి మాత్రం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. మహిళలు తమ పొదుపు సంఘాల ఖాతాల్లో దాచుకున్న డబ్బులను వాడుకోవడానికి బ్యాంకులు ఆంక్షలు పెడుతున్నాయి. 

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.75 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, వాటిల్లో మహిళలు ప్రతినెలా దాచుకున్న డబ్బులే ఇప్పుడు రూ.11,196 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా మహిళలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకొక్కరు గరిష్టంగా నెలకు రూ. 200 వరకూ దాచుకుంటుండడంతో పొదుపు డబ్బులు భారీగా పెరిగాయి. మరోపక్క.. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ.30 వేల కోట్ల వరకూ ఉంటాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు తెలిపారు.

అంటే మొత్తం పొదుపు సంఘాల రుణాల్లో మూడో వంతుకుపైగా పొదుపు సంఘాల మహిళలు దాచుకున్న డబ్బులు ఉన్నా, వాటిని వాళ్లు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సహజంగా పొదుపు ఖాతాలో ఉండే డబ్బులకు బ్యాంకులు నామమాత్రపు వడ్డీ ఇచ్చే పరిస్థితి ఉండగా, రుణాలపై వడ్డీ మాత్రం రెండు మూడింతల దాకా ఉంటోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ నిబంధన 7.3.6 మేరకు సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొనప్పటికీ చాలా బ్యాంకులు ఆ నిబంధన పాటించడంలేదని సెర్ప్‌ కార్యాలయ దృష్టికి వచ్చింది. 

సీసీ విధానంలోనూ అదనపు భారంలేకుండా..
మహిళలు పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించి గత ఏడెనిమిది ఏళ్ల నుంచి సీసీ (క్యాష్‌ అండ్‌ క్రెడిట్‌ ) ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. ఈ విధానంలో రుణాలను గరిష్ట లోను మొత్తం మేరకు సీసీ ఖాతాలో అప్పుగా ఇచ్చినట్లు చూపి, ఆ మొత్తాన్ని సంఘం పొదుపు ఖాతాలో జమచేస్తున్నాయి.

సీసీ విధానమంటే.. ఆ రుణ ఖాతాలోనే గరిష్ట లోను వరకు అవసరమైనప్పుడే డబ్బులు వినియోగించుకోవడం, ఆ వినియోగించుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, బ్యాంకర్లు కొన్నిచోట్ల మహిళలు లోను మొత్తం అవసరంలేని సమయంలో కూడా రుణ ఖాతాలో మొత్తం లోను డబ్బులను తీసుకున్నట్లుగా చూపి, వాటిని ఆ సంఘ పొదుపు ఖాతాలో ఉంచేస్తున్నారు. దీనివల్ల అవసరంలేని డబ్బులకూ వడ్డీ భారం పడుతోంది.

వడ్డీ తగ్గించాలన్న సీఎం జగన్‌..
ఇక పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాల అంశంలో రుణాలిచ్చే సమయంలో మహిళలపై వివిధ రకాల అదనపు భారాలేవీ లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూణ్ణెళ్ల క్రితం బ్యాంకర్ల సమావేశంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యలు కారణంగా మహిళల రుణాల చెల్లింపు ఇప్పుడు 99.5 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరుణంలో బ్యాంకర్లు వీలైనంత మేర పొదుపు సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు.

రుణాలు తీసుకునే ముందు సంఘాలలో ఉండే తమ పొదుపు డబ్బులను మహిళలు వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు.. చాలాచోట్ల సీసీ విధానంవల్ల జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ప్రస్తావించి, పేద మహిళలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. ఈ విషయాన్ని కేంద్రానికి సైతం లేఖలు రాయడంతో కేంద్రం సైతం కదిలింది.  

క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర అధికారులు..
ఈ నేపథ్యంలో.. పొదుపు సంఘాల మహిళలు నష్టపోతున్న వైనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పొదుపు సంఘాల రుణ విభాగంలో పనిచేసే కీలక అధికారి రామ్‌బియాస్‌ గుప్తా రాష్ట్రానికి వచ్చారు. సెర్ప్‌ అధికారులతో కలిసి ఆయన గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను కలిసి వివరాలు సేకరించారు.

ఆ తర్వాత ఈనెల 12న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్, రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఏజీఎం రాజాబాబుతో కలిసి ఆయన విజయవాడలో బ్యాంకర్ల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ మొత్తం వివరాలను ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ విభాగానికి సెర్ప్‌ కార్యాలయం తెలిపింది. 

0.5 శాతం మహిళలు కూడా నష్టపోకూడదనే..
మన రాష్ట్రంలో ప్రత్యేకంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘పొదుపు’ మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. సకాలంలో రుణ కిస్తీలు చెల్లించకుండా ఉంటున్న 0.5 శాతం మహిళలు సైతం నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశముందని వారు భావిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top