ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల డీఎలు విడుదల

ap government released da for govt employees - Sakshi

23 శాతం ఫిట్‌మెంట్‌

సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మేరకు 23 శాతం ఫిట్‌మెంట్‌కు అనుగుణంగా కొత్త పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌ డీఏలను విడుదల చేస్తూ ఆర్థికశాఖ సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా సీఎం జగన్‌ 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని, పెండింగ్‌ డీఏలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అందుకనుగుణంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీచేశారు. పే రివిజన్‌ కమిషన్‌ నివేదికపై సీఎస్‌ అధ్యక్షతన వేసిన కమిటీ చేసిన పలు సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడి కన్నా వేతనాలు, జీతభత్యాల వ్యయం ఎక్కువగా ఉందని సీఎస్‌ కమిటీ పేర్కొనడంతో.. ఐదేళ్లకొకసారి వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయలేమని, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన సీఎస్‌ కమిటీ సూచించిన మేరకు ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ)ను అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

► 50 లక్షలకు పైబడి జనాభా ఉండే నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు బేసిక్‌ స్కేలుపై 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, 5–50 లక్షల మధ్య జనాభా ఉండే నగరాలు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం, 5 లక్షల లోపు జనాభా ఉండే పట్టణాలు, గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏగా నిర్దారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
► ఐఏఎస్‌ అధికారులతో పాటు యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ డిగ్రీ కాలేజీలలో యూజీసీ వేతనాలతో పనిచేసే వారికి రివైజ్డ్‌ హెచ్‌ఆర్‌ఏ వర్తించదని తెలిపారు.  
► కన్సాలిడేటెడ్‌ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌దారులకు కూడా కొత్త పీఆర్సీ అమలు ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. 
► 1993 నవంబరు 25వ తేదీకి ముందు ఎన్‌ఎంఆర్, పార్ట్‌టైం ఉద్యోగులుగా చేరిన వారికి కూడా కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు అమలు చేస్తూ ఇంకో ఉత్తర్వు జారీ చేశారు.  
► అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో కేటగిరీ–1లో పేర్కొన్న వారికి రూ.21,500 చొప్పున, కేటగిరీ–2 వారికి రూ.18,500, కేటగిరీ–3 వారికి రూ.15,000 చొప్పున కొత్త వేతనాన్ని అమలు చేస్తూ జీవో జారీ చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top