బడికి రప్పించేలా రవాణా చార్జీలు

AP Government Pay Transport Charges For Students - Sakshi

సాక్షి, అమరావతి: బడి వయసు పిల్లలెవరూ చదువులకు దూరం కాకుండా స్కూళ్లలో చేరేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ పాఠశాల విద్యాశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి కింద ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లుగా రూ.19,617 కోట్లను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం మూడేళ్లలో రూ.3,117 కోట్లను వెచ్చించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద రూ.48.92 కోట్లతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.

జగనన్న విద్యాకానుక ద్వారా రూ.2,324 కోట్లతో కుట్టుకూలీతో 3 జతల యూనిఫారం దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుబుక్కులు, డిక్షనరీతో కూడిన స్టూడెంట్‌ కిట్లు అందిస్తున్నారు. వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారికి, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను  సైతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు అందిస్తోంది. 2022–23కిగాను 40 వేల మందికిపైగా రవాణా చార్జీల కింద రూ.24.25 కోట్లు చెల్లించనున్నారు. ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 32,569 మందికి రూ.19.54 కోట్లు, సెకండరీ స్కూలు విద్యార్థులు 7852 మందికి రూ.4.71 కోట్లు రవాణా చార్జీలుగా అందించనున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో బడిబయట  ఉన్న పిల్లలకోసం రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వలస వెళ్లిన వారి పిల్లలు, ఇతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చిన వారి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు సీజనల్‌ హాస్టళ్లను విద్యాశాఖ నెలకొల్పింది. అనాథలు, ఆర్థిక పరిస్థితి సరిగాలేని పిల్లల కోసం సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top