AP: చెరువు మెరిసి.. చేను మురిసి!

AP Government Has Taken Steps To Rehabilitate The Ponds Tirupati - Sakshi

జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు

చెరువుల పునరుద్ధరణకు రూ.వందల కోట్లు

2021–22వ సంవత్సరానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 934 మి.మీ కాగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,485 మి.మీ వర్షపాతం నమోదైంది. 2021 ఖరీఫ్‌ సీజన్‌లో 1,90,955 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 1,77,075 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి 37,950 హెక్టార్లలో, వేరుశెనగ 94,629 హెక్టార్లలో, ఇతర పంటలు 44,496 హెక్టార్లలో సాగు చేశారని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల, చెరువులు నిండు కుండల్లా ఉండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అదే విధంగా వర్షాలకు కురిసిన నీటిని సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను పరిశీలిస్తే..

సాక్షి ప్రతినిధి, తిరుపతి: గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్న చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  గత సర్కారు చేసిన తప్పిదాల వల్ల అనేక మంది రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, నూతన చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ పనులకు వందల కోట్లు వెచ్చిస్తోంది. 

కాలువల తవ్వకానికి రూ.193.23 కోట్లు 
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం నుంచి గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాల్లోని చెరువులకు నీరు సరఫరా చేసేందుకు వరద కాలువ తవ్వకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.193.23 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత విజయవాడకు చెందిన ఎస్‌ఎల్‌టీసీ అనుమతితో టెండర్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రవాహ కాలువల ప్రక్రియ పూర్తి కాగానే 2,439 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. 

అభివృద్ధి పనులు ఇలా.. 
► శ్రీకాళహస్తి, ఏర్పేడులలో కమ్యూనిటీ బేస్డ్‌ ట్యాంక్స్‌ పునరుద్ధరణ కింద 48 చెరువుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తి కాగానే 13,050 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. 
►  ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో జిల్లా వ్యాప్తంగా 187 చెరువుల అభివృద్ధికి రూ.54.39 కోట్లు మంజూరు చేశారు.  
►  గత ఏడాది నవంబర్‌లో తుఫాను కారణంగా దెబ్బతిన్న 617 చెరువులు, కాలువలు, ఇతర నీటి పారుదల కట్టడాల తాత్కాలిక మరమ్మతులకు రూ.11.37 కోట్లు ఖర్చు చేశారు. ► చిత్తూరు, బంగారుపాళ్యం, గుడిపాల, జీడీనెల్లూరు, సత్యవేడు, వరదయ్యపాళ్యం మండలాల్లో చెరువులు, సరఫరా కాలువల అభివృద్ధికి 15 పనులకు రూ.18.60 కోట్లు మంజూరు చేశారు. ఇవి పూర్తయితే 3,850 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. 
► చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, మొలకలచెరువు, కలకడ, గంగాధరనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, గుర్రంకొండ, కలికిరి మండలాల్లో చెరువుల అభివృద్ధి పనులకు రూ.13.36 కోట్లు మంజూరు చేశారు. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 2,790 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. 
► ఏపీఐఎల్‌ఐపీ–2 పథకంలో భాగంగా 53 చెరువులకు రూ.32.82 కోట్లు మంజూరయ్యాయి. 
► పిచ్చాటూరు మండలంలో అరణియార్‌ ప్రాజెకు పునరుద్ధరణకు రూ.35.64 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. కార్వేటినగరంలో కృష్ణాపురం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.31.80 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయితే 26,626.78 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని ఇరిగేషన్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

చెరువుల అభివృద్ధికి చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పనుల పురోగతిపై ఇరిగేషన్‌ శాఖ అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చెరువులను పునరిద్ధరించడం, ప్రాజెక్టుల పనులతో రైతులకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. జిల్లా మొత్తం మంజూరైన పనులను వేగవంతంగా నిర్వహించి పురోగతి చూపేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాం. 
– హరినారాయణన్, జిల్లా కలెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top