బంగారు భవిష్యత్తుకే ‘సీబీఎస్‌ఈ’

AP government has announced the introduction of the CBSE syllabus - Sakshi

రెండేళ్లలో 6 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక   

సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా మార్పులు తెచ్చి రాష్ట్ర విద్యార్థులు పోటీ పడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తరఫున రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో 61,208 పాఠశాలలు ఉండగా 44,639 (73 శాతం) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో 43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 6,13,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ప్రవేశం పొందారు.

వీరిలో దాదాపు 4 లక్షల మంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రాగా రెండు లక్షల మంది కొత్తగా ప్రవేశం పొందారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం, అదికూడా కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రవేశాలు పొందడం చరిత్రాత్మకం. వీరందరికీ బంగారు భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. సీబీఎస్‌ఈకి దేశ విదేశాల్లో 25,000కి పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా బోర్డుకు అనుసంధానించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 2024 – 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు ద్వారా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపడుతుంది’ అని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top