మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్‌ చిట్‌చాట్‌

AP DGP Gautam Sawang Chit Chat With Media - Sakshi

ఏపీఎస్సీ అనేది పారామిలటరీ ఫోర్స్‌లాంటిది

స్పందన పిటిషన్లలో 52శాతం మహిళలవే

ఏపీ పోలీసులకు గతేడాది 108 అవార్డులు

మైక్రోఫైనాన్స్‌ యాప్స్‌‌పై ప్రత్యేక దృష్టి పెడతాం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డీజీపీ గౌతం సవాంగ్ మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన ఏపీఎస్పీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చాము. డీజీపీ డిస్క్ అనేది కొత్త అవార్డు. విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డు. ఏపీఎస్పీ అనేది ఒక పారామిలటరీ ఫోర్స్‌లాగా ఏర్పాటయ్యింది. ఈ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచీ ఉన్నది. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉంది. పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్‌కు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికం. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమే. ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్‌గా గుర్తించబడింది. అవసరమైన అన్ని వనరులు లేకపోయినా ఏపీ పోలీస్ పనిచేస్తోంది. బాధ్యత, పారదర్శకత, ప్రతిభ ప్రదర్శిస్తూ ఏపీ పోలీస్ ప్రతి నిత్యం పనిచేస్తున్నారు’ అని తెలిపారు. (చదవండి: సవాంగ్‌ స్ఫూర్తితోనే అవార్డు)

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్ సర్వీసులను ఉత్తమంగా తయారు చేయడానికి అవసరమైన వనరులు ఇస్తున్నారు. పోలీసు వ్యవస్ధలో వచ్చిన మార్పులతో సామాన్య ప్రజలకు సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సామాన్య మానవుడికి పోలీసుల ప్రాధాన్యత తెలియాలి. స్పందన ద్వారా ప్రజలు పోలీసులకు నేరుగా పిటిషన్లు పెట్టుకోవచ్చు.. వీటికి సీఎం కార్యాలయం వరకూ పర్యవేక్షణ ఉంటుంది. స్పందనలో వచ్చే పిటిషన్లలో 52 శాతం మహిళలు ఉన్నారు.. వారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దిశ పోలీసులు చాలా బాధ్యతగా పని చేస్తున్నారు. దిశా ఎస్ ఓ ఎస్ యాప్‌ని ప్రతి మహిళా డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఆన్‌లో ఉంచి మూడుసార్లు ఫోన్ షేక్ చేస్తే వీడియోతో సహా దగ్గరలోని పోలీస్ స్టేషనుకు వెళుతుంది. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.05లక్షలకు పైగా ఎఫ్ఐఆర్‌లు డౌన్‌లోడ్ చేశారు. ఏపీ పోలీసులకు గత సంవత్సర కాలంలో 108 అవార్డులు వచ్చాయి. ఐసీజేఎస్‌లో దేశంలోనే రెండవ స్ధానం ఏపీ పోలీస్ సాధించింది. రాబోయే రోజుల్లో పోలీసులు మేం ఉన్నాం, మీకోసమే ఉన్నాం అనే నమ్మకం బలహీనవర్గాలకు ఇవ్వాలి. వ్యక్తిగతంగా, అందరం  దేశానికే గర్వకారణం అయ్యేలా పనిచేయాలి’ అన్నారు. (34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ ‌ )

మైక్రోఫైనాన్స్ పై ప్రత్యేక‌ దృష్టి పెడతాం అన్నారు డీజీపీ గౌతం సవాంగ్‌. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి. నోయిడా, ఢిల్లీ, గురుగావ్‌ల నుంచి ఎక్కువగా ఈ యాప్‌లనిర్వహణ జరుగుతున్నట్టు గుర్తించాం. మొబైల్ లోన్‌యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top