CM YS Jagan Nellore Tour: సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. బ్యారేజీకి గౌతమ్‌ రెడ్డి పేరు

AP CM YS Jagans Nellore Tour Details - Sakshi

Updates:

► గౌతమ్‌ మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్‌ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్‌ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ గౌతమ్‌ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది. గౌతమ్‌ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర‍్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్‌ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్‌ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం.
-సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి

►ముందు నుండి వైఎస్‌ఆర్‌ కుటుంబం తమకు అండగా ఉందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డికి తన కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందని ఈ సందర్భంగా తెలిపారు. తమ కుటుంబపై చూపిన ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
-మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

► రాజకీయాల్లో గౌతమ్‌ రెడ్డి ఎప్పుడూ వివాదాలకు పోలేదు. అందరు నేతలతో కలిసి మెలిసి ఉండేవారు. - మంత్రి అనిల్‌

► గౌతం రెడ్డి మరణం పార్టీకి, నెల్లూరుకు తీరని లోటు. - కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

► దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డిపై అభిమానంతో ఆయన చిత్ర పటాలతో ఇంతియాజ్‌ అనే దివ్యాంగుడు.. భగవద్గీతను తయారు చేశాడు. సంస్మరణ సభలో గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్ది చేతుల మీదుగా సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డికి ఆ భగవద్గీతను అందించారు.

► దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌మెహన్‌ రెడ్డి ఓదార్చారు. అనంతరం గౌతమ్‌ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి సీఎం నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

► దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌మెహన్‌ రెడ్డి.

► నెల్లూరు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి

► రేణిగుంట నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి

► గన్నవరం నుండి సీఎం జగన్‌మెహన్‌ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

► సీఎం వైఎస్ జగన్‌మెహన్‌ రెడ్డి.. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు రానున్నారు. దీంతో పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

ఆదివారం నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో బందోబస్తు విధుల్లో పాల్గొననున్న సిబ్బందితో ఎస్పీ సీహెచ్‌ విజయారావు సమావేశం నిర్వహించి  దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. సీఎం పర్యటన ఆధ్యంతం అప్రమత్తంగా ఉండాలన్నారు. హెలిప్యాడ్, కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ముందస్తు అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే ముఖ్యమంత్రి వద్దకు అనుమతించాలన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనీఖలు చేయాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. సిబ్బంది అందరూ విధిగా యూనిఫాం, ఐడీలు ధరించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, విధులకు గైర్హాజరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.  

సీఎం పర్యటన షెడ్యూల్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.  11.40 రోడ్డు మార్గాన బయలుదేరి 11.50కు వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. 11.50 నుంచి 12.40 వరకు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొంటారు. అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో రేణిగుంటకు బయలుదేరి వెళుతారు. 1.20 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. సీఎం వెళ్లే మార్గంలో రాకపోకలను నిషేధించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు.

నగరంలో ట్రయల్‌ కాన్వాయ్‌  
నెల్లూరు నగరంలో ఆదివారం ట్రయల్‌ కాన్వాయ్‌ నిర్వహించారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రారంభమైన ట్రయల్‌ కాన్వాయ్‌ వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని అక్కడ నుంచి తిరిగి పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంది. ట్రయల్‌ కాన్వాయ్‌ను ఎస్పీ విజయారావు పర్యవేక్షించారు. హెలికాప్టర్‌ సైతం ట్రయల్‌రన్‌ నిర్వహించింది.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top