AP CM YS Jagan Review Meeting On Heavy Rains, Relief Measures - Sakshi
Sakshi News home page

వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ నాలుగు జిల్లాలకు రూ. 8 కోట్ల తక్షణ సాయం

Published Tue, Jul 12 2022 10:59 AM

AP CM YS Jagan Review Meeting On Heavy Rains, Relief Measures - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్‌.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదారినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని అన్నారు.

‘కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. కంట్రోలు రూమ్స్‌ సమర్థవంతంగా పనిచేయాలి. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుంది.
చదవండి: Andhra Pradesh: మరో రెండ్రోజులు వర్షాలే

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కరెంట్‌ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోండి.  తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలి.

శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండండి. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోండి. బోట్లు, లైఫ్‌ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచండి. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నాం. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని’ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.
చదవండి: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ వర్షాలు.. గోదారి ఉగ్రరూపం

Advertisement
Advertisement