CM YS Jagan: నిర్దేశిత గడువులోగా అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం

AP CM YS Jagan Review On Ambedkar Smruthi Vanam - Sakshi

సాక్షి, అమరావతి: అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి­వనం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయా­లని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధి­కారులను ఆదేశించారు. అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు. విజయ­వాడ స్వరాజ్‌ మైదా­నంలో 125 అడుగుల ఎత్తుండే అంబే­డ్కర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విగ్ర­హం తయారీ, దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుం­దరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. 

అత్యంత నాణ్యతతో అందంగా నిర్మాణాలు ఉండాలని, పనుల పర్యవేక్షణకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 125 అడుగుల ఎత్తుండే విగ్రహంతో పాటు పీఠంతో కలిపి మొత్తంగా 206 అడుగుల ఎత్తు వస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందన్నారు. ఈ ప్రాంగణంలో 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. 

అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం రూ.268 కోట్లు అని, విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహానికి సంబంధించిన కొన్ని భాగాలను ఇప్పటికే తరలించామని.. కారు, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని వివరించారు. మీ (సీఎం) ఆదేశాల మేరకు స్మృతివనం వరకు రోడ్లను సుందరీకరిస్తామని చెప్పారు. 

ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సృజన, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top