జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

AP CM Ys Jagan Mohan Reddy Flag Hoisting In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ జగన్‌ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. అనంతరం ప్రసంగిస్తూ ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు. 

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించింది
సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు
పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నాం
రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టాం
కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం
ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగింది
ఆర్ధిక పరిస్థితులు లేకున్నా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం
విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నాం
పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ
సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం
త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని
కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటాం
కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా  సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నాం
ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం
అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం
కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం
చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది చీడపురుగు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి
ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్‌ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశాం
ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తిస్థాయి ఫలాలు మరో 10 నుంచి 20 ఏళ్లకు వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు
రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మనసుతో అమలు చేస్తున్న పథకాలు
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దాదాపు 33శాతం పేదలకు చదువుకునే అవకాశం లేదు. విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం
నాడు-నేడు ద్వారా పాఠశాలలు, కాలేజీల రూపురేఖలు మారుస్తున్నాం
100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి దీవెన అమలు చేస్తున్నాం
ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం
స్కూల్ విద్యార్ధులకు పుస్తకాలు, షూస్‌ వరకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాం
తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా అమలు చేస్తున్నాం
చదువే నిజమైన ఆస్తి, సంపద అని నమ్మి విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చాం
ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకం అమలు చేస్తున్నాం
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు పరీక్షలు చేస్తున్నాం
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం
గతంలో మసకబారిన ఆరోగ్యశ్రీకి కొత్త వెలుగులు తీసుకొచ్చాం. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. 
బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా.. సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలను ఒకేసారి 108, 104 సేవల కోసం పంపాం
ఆపరేషన్ అయిన రోగులకు రూ.5వేలు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేల పింఛన్ అందిస్తున్నాం
కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకున్నాం
జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం
2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్‌.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్‌ల పనులు మొదలుపెట్టబోతున్నాం
ఈ ఏడాదిలో వంశధార ఫేజ్‌-2, వంశధార-నాగావళి అనుసంధానం.. వెలిగొండ ఫేజ్‌-1, అవుకు టన్నెల్‌ -2, సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజీల్ని పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం
రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో.. రాజీ లేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top