
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తమ పార్టీకి చెందిన వారికే వర్తింపు చేయాలని, ఇది ఏ స్థాయి అధికారి అయినా గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని గతంలో బహిరంగంగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా టీడీపీ కార్యకర్తలకే ఇస్తామనే విషయాన్ని తాజాగా బహిర్గతం చేశారు. ఓ టీడీపీ కార్యకర్తకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేబినెట్ సాక్షిగా నిలవడం గమనార్హం. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చెడు సాంప్రదాయానికే తెరలేపినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్యగావించబడితే, ఆయన కుమారుడికి ఇప్పుడు శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.
2022లో వెల్దుర్ది మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య హత్యగావించబడ్డాడు. అయితే రెండు కుటుంబాల నడుమ చోటు చేసుకున్న విభేదాల కారణంగా చంద్రయ్యను హత్య చేసింది మరో కుటుంబం. ఈ హత్యకు రెండు కుటుంబాల మధ్య కక్ష అని అప్పట్లోనే పోలీసులు సైతం ప్రకటించారు. ఇక్కడ చంద్రయ్య కుటుంబం కూడా ఒక కుటుంబంపైనే ఫిర్యాదు చేసింది కూడా. అంటే ఇదంతా వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంటే, మరి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం