
స్నేహితుడైన టీడీపీ నేత నిలువునా ముంచేశాడు
వైరల్‌గా మారిన ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యాపారి చివరి మాటలు ఆడియో
సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఓ చిరు వ్యాపారి స్నేహితుడైన (టీడీపీ మాజీ కౌన్సిలర్) వడ్డీ వ్యాపారి అరాచకానికి బలయ్యాడు. బుధవారం ఉదయం 4.30 సమయంలో తన ఎలక్ట్రిక్ షాపులోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుడే తనను నట్టేట ముంచేశాడంటూ ఆత్మహత్యకు ముందు చిరువ్యాపారి ఇందూరి నాగభూషణరావు రికార్డు చేసిన ఆడియోను మిత్రులకు పంపించాడు.
సాలూరులోని మామిడిపల్లి కూడలిలో ఎలక్ట్రిక్ షాపు నడుపుతున్న వ్యాపారి ఇందూరి నాగభూషణరావు పట్టణంలోని డబ్బివీధికి చెందిన వడ్డీ వ్యాపారి డబ్బి కృష్ణారావు వద్ద తన వ్యాపార అవసరాల కోసం రూ.40 లక్షలు అప్పుచేశాడు. ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఎలక్ట్రిక్ షాపును వడ్డీ వ్యాపారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.కోటి విలువైన షాపును రూ.75 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నాగభూషణరావు తీసుకున్న రూ.40 లక్షలు అప్పు మినహాయిస్తే మిగిలిన రూ.35 లక్షలు ఆయన చేతికి ఇవ్వాల్సి ఉండగా, రూ.10 లక్షలు అప్పుగా తిరిగిచ్చాడు. నాగభూషణరావు నుంచి కొనుగోలు చేసుకున్న షాపునే వ్యాపారికి నెలకు రూ.20వేలు అద్దెప్రాతిపదికన తనఖా ఇచ్చాడు.
షాపుకి అద్దె కింద నెలకు రూ.20 వేలు, పది లక్షలకు వడ్డీ రూ.పదివేలు చొప్పున నెలకు ప్రతినెలా రూ.30 వేలు వడ్డీ వ్యాపారి వసూలు చేస్తున్నాడు. తన డబ్బునే ఉంచుకుని, తనకు అప్పుకింద ఇచ్చి వడ్డీ వసూలు చేస్తూ ఆర్థిక కష్టాల్లోకి నెట్టేశాడని, ఎదిరించే ధైర్యంలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆడియోలో పేర్కొన్నారు. నాగభూషణరావుకి భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు సాలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన నాగభూషణరావు జేబులో రాతపూర్వక లేఖ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆలేఖను స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబాన్ని ఆదుకోండి..
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని ఉద్దేశించి చిరువ్యాపారి నాగభూషణరావు ఆడియో విడుదల చేశాడు. తన స్నేహితుడు కృష్ణారావు మోసాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన వేడుకున్నాడు. తనకు కృష్ణారావు ఇవ్వాల్సిన డబ్బు రూ.15లక్షలు, నెలనెలా చెల్లించిన డబ్బు రూ.12 లక్షలు తన కుటుంబానికి ఇప్పించాలని కోరాడు. తన కుటుంబానికి అదే ఆస్తి అని చెప్పాడు. డబ్బి కృష్ణారావు మోసాన్ని మీతో చెప్పడానికి ప్రయత్నించానని, కానీ పరిస్థితి అనుకూలించక చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వడ్డీవ్యాపారి డబ్బి కృష్ణరావు మాజీ కౌన్సిలర్‌కాగా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనుచరుడిగా పేరుంది.