వ్యవసాయ సాయంపై అసెంబ్లీ సీఎం జగన్‌ ప్రకటన

AP Assembly: Crop Compensation Paid By December 31, says CM YS Jagan - Sakshi

డిసెంబర్‌ 31లోపు రైతులకు నష్ట పరిహారం

సాక్షి, అమరావతి: రైతులకు ప్రభుత్వం చేసిన మంచిని పక్కదోవ పట్టించేందుకే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు యాక్టర్‌ అయితే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కథ, స్క్కీన్‌ప్లే, డైరెక్షన్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.  వ్యవసాయ సాయంపై ముఖ్యమంత్రి సభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రామానాయుడు మాటలను చంద్రబాబు అడ్డుకుని రెచ్చిపోయారు. ఐదేళ్లు నేను ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎప్పుడూ పోడియం వద్దకు రాలేదు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. రైతులకు సీఎం ఏం చేశారన్నది ప్రధానాంశం కాకుండా బాబు రాద్ధాంతం. ప్రకృతి వైపరీత్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తమను ఎలా ఆదుకుంటుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యింది. (అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా.. సస్పెన్షన్)

డిసెంబర్ 31లోగా పంటన నష్ట పరిహారం
గతంలో ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయి. రైతులకు కొంత మేర నష్టం జరిగినా వారిని యుద్ధప్రాతిపదికన ఆదుకుంటున్నాం. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నా. ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులను.. అదే సీజన్‌లోనే నష్టపరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి. రూ.126 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాం. అక్టోబర్‌లో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు.. నవంబర్‌లో రూ.132 కోట్ల నష్టపరిహారం అందించాం. (ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే: సీఎం జగన్‌)

నివర్ తుపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి రూ.500 ఆర్ధిక సాయం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఇంటికి రూ.2వేలు ఆర్ధిక సాయం అందుతుంది. డిసెంబర్ 15లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆదేశించాం. డిసెంబర్ 31లోగా పంట నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు కూడా అందిస్తాం. ఇళ్లు, పశువులు, ఇతర నష్టాలను కూడా డిసెంబర్ 15లోగా అంచనా వేస్తాం. డిసెంబర్ 31లోగా నష్టపరిహారం అందిస్తాం. (‘అదే నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తా..’)

తుపాను, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను, విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాం. వర్షాల వల్ల రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. రంగు మారిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం. 2020 ఖరీఫ్ నుంచి బీమా బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఖరీఫ్‌ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి బీమా చెల్లింపు. పంటల ఉచిత బీమా కోసం ప్రభుత్వం రూ.1,030 కోట్లు చెల్లించింది​’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top