Krishna Water Dispute: చంద్రబాబు పాపాలు: నీళ్లపై నిర్లక్ష్యంతోనే నిప్పు

AP And Telangana Krishna Water Dispute Over Chandrababu Negligence - Sakshi

కృష్ణా జలాలు, డ్యామ్‌ల నియంత్రణపై చంద్రబాబు నిర్లిప్తతతోనే ఈ దుస్థితి

వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ఎదుట మోకరిల్లిన టీడీపీ అధినేత 

సాక్షి, అమరావతి: కృష్ణా ఆయకట్టు రైతులకు చంద్రబాబు చేసిన పాపాలు శాపాల్లా పరిణమించాయి. వ్యక్తిగత ప్రయోజనాలతోపాటు ఓటుకు కోట్లు కేసుల భయంతో కృష్ణా జలాలపై హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని నీటిపారుదల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ తన చేతుల్లోకి తీసుకున్న తరహాలోనే మరో ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలాన్ని నాడు పూర్తి స్థాయిలో ఏపీ అధీనంలోకి తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి ఉత్పన్నమయ్యేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఎడమ గట్టు కేంద్రాన్ని తన నియంత్రణలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్‌ శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగక పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు.. కృష్ణా డెల్టాదీ అదే దుస్థితి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు రాజీలేని పోరాటం చేస్తున్నారని నిపుణులు, పరిశీలకులు పేర్కొంటున్నారు.

రెండు కళ్లు.. కొబ్బరి చిప్పల సిద్ధాంతం
విభజన నేపథ్యంలో నీటి వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌ను ఖరారు చేయని కేంద్రం ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు  చేసింది. ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న ఆ ప్రాజెక్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించేలా 2014లో ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్‌ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది.

రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్‌ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుతో తెలంగాణ సర్కార్‌ అది కూడా తన అధీనంలోకి తీసుకుంది. రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడ్డ చంద్రబాబు దీనిపై నోరు మెదపలేదు. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు ఉత్తర్వులను బేఖాతర్‌ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

కేసుల భయంతో సాగర్, డెల్టా హక్కులు తాకట్టు..
సాగర్‌ కుడి కాలువకు కేటాయించిన నీరు పూర్తి స్థాయిలో విడుదల కాకుండానే 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్‌ తన నియంత్రణలో ఉండటంతో అర్థాంతరంగా నిలిపివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉన్న  సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్‌ వద్దకు చేరుకున్నారు.

అయితే ఓటుకు కోట్లు కేసులో సాక్షాధారాలతో దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడి వారిని వెనక్కి రప్పించారు. ఫలితంగా సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ తెలంగాణ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్‌ సాగర్‌ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు.

హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటం..
పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటూనే కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని నీటిపారుదల నిపుణులు పే ర్కొంటున్నారు. రాష్ట్రానికి వాటాగా దక్కిన 512 టీఎంసీలను పూర్తి స్థాయిలో వినియో గించుకునేందుకు గత 25 నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని, 20 19–20,20–21 నీటి సంవత్సరాల్లో అధికం గా జలాలను వాడుకోవడమే అందుకు నిదర్శ నమని గుర్తు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేం దుకు గతేడాది అక్టోబర్‌ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్వహిం చిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ముఖ్యమంత్రి జగన్‌ బలమైన వాదనలను వినిపించారని ప్రస్తావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను నియంత్రించాలని కోరుతూ  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ లేఖలు రాయడాన్ని స్వాగతిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top