విద్యుత్‌ ఉత్పత్తిలో మరో ముందడుగు  | Another step forward in power generation | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉత్పత్తిలో మరో ముందడుగు 

Published Mon, Jun 12 2023 2:58 AM | Last Updated on Mon, Jun 12 2023 2:59 AM

Another step forward in power generation - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌(ఏపీ జెన్‌కో) మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(ఎన్‌టీటీపీఎస్‌)లో స్టేజ్‌–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను ఆదివా­రం విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది.

ఈ యూనిట్‌ బాయిలర్‌ సూపర్‌ క్రిటికల్‌ సాంకేతికత, శక్తి సామర్థ్య టర్బైన్, జనరేటర్‌తో 80 ఎకరా­ల విస్తీర్ణంలో నిర్మించారు. నీటిని ఆదా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. యూనిట్‌ను పూర్తి లోడ్‌తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బూడిద వృథా అవ్వకుండా వంద శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు.

ఇటీవలే నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కూడా 800 మెగావాట్ల యూనిట్‌–3 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్‌టీటీపీఎస్‌లో కొత్త యూనిట్‌ ట్రయల్‌ ఆపరేషన్‌తో ఏపీ జెన్‌కో థర్మల్‌ ఇన్‌స్టాల్డ్‌ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది.

ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో రెండు 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ యూనిట్లు ఏపీలోనే ప్రారంభమవ్వడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌కు ఏపీ జెన్‌కో రోజూ 102 నుంచి 105 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో దాదాపు 40 నుంచి 45 శాతంగా ఉంది. 

జూలై నెలాఖరుకల్లా వాణిజ్య ఉత్పత్తి.. 
కొత్త యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తిని వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్, బీజీఆర్‌ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సూచించారు. గ్రిడ్‌ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్‌ ఉత్పత్తిని సాధించాలన్నారు.

విద్యుత్‌ రంగానికి సీఎం వైఎస్‌ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. అత్యుత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీ జెన్‌కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు,  బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్‌ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement