ఫొటోలు.. 'సెల్‌'చల్‌

Annavaram Lord Satyanarayana Photos Viral in Social Media - Sakshi

సోషల్‌ మీడియాలో సత్యదేవుని మూల విరాట్‌ ఫొటోల ప్రత్యక్షం

ట్యూబ్‌ ఛానల్‌లోనూ ప్రసారం  

పుష్పాలంకరణ పనివారే తీసినట్టుగా సీసీ పుటేజీలో రికార్డు 

ఫొటో తీసిన వ్యక్తిపై పోలీసు కేసుకు ఈఓ త్రినాథరావు ఆదేశాలు

తూర్పుగోదావరి ,అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయంలో నిత్యం భక్తుల పూజలందుకునే సత్యదేవుడు, దేవేరీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల మూల విరాట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటోలు ఎవరు తీశారు? అవి ఎలా బయటకొచ్చాయనే ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించడంతో చిక్కుముడి వీడింది. స్వామివారి ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6.19 గంటలకు స్వామివారి గర్భాలయంలో పుష్పాలంకరణ చేసిన స్థానిక కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తి ఈ ఫొటోలు తీసినట్టు గుర్తించారు. రత్నగిరిపై స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు తీయడానికి వీల్లేదు. అసలు కెమెరా, సెల్‌ఫోన్లను ఆలయంలోనికే అనుమతించరు. ఇప్పుడు కరోనాతో దేవస్థానంలో షాపులన్నీ మూసి ఉండడంతో అందరూ ఫోన్లతోనే ఆలయం లోపలికి వెళుతున్నారు. ఎవరైనా స్వామి, అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయత్నించినా అక్కడ సిబ్బంది, అర్చకస్వాములు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకుంటారు.

ఫొటో తీసి ఉంటే దానిని డిలీట్‌ చేసే వరకు ఊరుకోరు. అటువంటిది స్వర్ణాభరణాలు, నూతన పట్టువస్త్రాలు, పుష్పాలంకరణలో ఉన్న స్వామి, అమ్మవార్ల ఫొటోలు బుధవారం సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవడంతో దేవస్థానంలో అందరూ షాక్‌కు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం వరకు స్వామివారి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రానికి ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీనిపై విచారణ జరపాలని ఈఓ త్రినాథరావు ఇన్‌ఛార్జి డిప్యూటీ ఈఓ ఈరంకి జగన్నాథరావును ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం డిప్యూటీ ఈఓ  సమక్షంలో సీసీ పుటేజీ పరిశీలించగా మంగళవారం సాయంత్రం ఆలయంలో పుష్పాలంకరణ చేసిన పనివారిలో ఒకరు ఫొటోలు తీయడం సీసీ టీవీ లో కనిపించింది. అతడి పక్కనే దేవస్థానం పల్లకీ బోయీ ఒకరున్నా ఫొటోలు తీయవద్దని వారించకపోవడం కనిపించింది. దీంతో ఆ పల్లకీ బోయీని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఫొటోలు తీసిన వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సంబంధి అధికారులను ఈఓ త్రినాథరావు ఆదేశించారు. ఇతర సిబ్బందిపై కూడా చర్యలు ఉండవచ్చని సమచారం. 

సిబ్బందిలో నిర్లిప్తిత
కరోనా కారణంగా స్వామివారి ఆలయానికి భక్తుల రాక చాలా తక్కువగా ఉంటోంది. గతంలో సాధారణ రోజుల్లో రోజుకు పదివేల నుంచి 30 వేలమంది, పర్వదినాల్లో 50 వేల పైబడి వచ్చేవారు. అటువంటిది ఇప్పుడు పట్టుమని రోజుకు వేయి మంది కూడా రావడం లేదు. భక్తులకు అంతరాలయం దర్శనం, తీర్థప్రసాదాల వితరణ, శఠగోపం వంటివి లేకపోవడంతో భక్తులు స్వామివారిని వెలుపల నుంచి తిలకించి వెళ్లిపోవల్సి వస్తోంది. ఆ భక్తులు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వస్తున్నారు. ఆ తరువాత దేవస్థానం ఖాళీ అవుతోంది.  దీనివలన సిబ్బందిలో  కొంత నిర్లిప్తిత  ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top