
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే తనూజ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయగా.. జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఓవర్ హీట్ కారణంగానే పేలినట్లు భావిస్తున్నారు. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవాలని.. చల్లటి ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు.